ఈ అత్యాసురలను చంపేదెవరు?

అత్యాచారం – అవతలివారి ఇష్టాయిష్టాలతో సంబందం లేకుండా.. మానసికంగా లేదా శారీరకంగా లేదా రెండు విధాలుగా దాడి చెయడం.
మన పురాణాల్లొ చదువుకున్నాం.. అసురుల/రాక్షసుల వల్ల మానవులకు సమస్య వచ్చినప్పుడు భగవంతుడు వాళ్ళని చంపడం/శిక్షించడం ద్వారా ఆ సమస్య నుండి బయటపడటం జరిగేది.
ప్రస్తుతమున్న ఈ అత్యాసురుడు అనే సమస్యని ఉరిశిక్షలు, నిర్భయ చట్టాలు అంతం చేయలేకపొతున్నాయి.
అత్యాచారం అనేది ఒక రాక్షస ఆలోచన.. ఉరిశిక్ష వేసి ఒక అత్యాసురుడుని చంపొచ్చుకాని, రక్తమాంసాలు లేని ఆలోచనని మాత్రం కాదు. అందువల్ల ఎన్ని శిక్షలు వేసినా, ఎన్ని చట్టాలు తెచ్చినా, అత్యాచారాలు ఆగడం లేదు. పదే పదే పునరావృతమవుతున్నాయి. ఈ సమస్యనుండి మనం బయట పడటం ఎలా?
సామజిక సమస్యలపై ప్రశ్నలు సంధించడం చాలా తేలికైన పని. ఆవేశపరుడైన ప్రతి పవన్ కళ్యాణ్ ఈ పని చేయగలడు. నేను ఒక సంతృప్తికరమైన సమాధానం అందరికీ ఇవ్వలేనప్పటికీ.. ప్రయత్నిస్తాను..
ఆలోచనను ఇంకో ఆలోచనతోనే ఎదుర్కొనవచ్చు.. లేదా ఆలోచనలో మార్పుతేవచ్చు.
ప్రస్తుతం ఈ సమాజంలో మానవీయతా విలువలకు సంబందించిన శిక్షణ మరియు అవగాహన ప్రతి ఒక్కరికి కల్పించాలి. దీన్ని ఒక విధిగా గుర్తింపచెయ్యాలి.
మన చదువు విలవలతో కూడినదై వుండాలి..తల్లిదండ్రులు ప్రతి ఒక్క బిడ్డకి ఇది నేర్పించాలి. మన రాజకీయ ఆర్దిక వ్యవస్థల సహకారం ఎంతో అవసరం..
జాతి మూలాలలోనుండి అత్యాచారం అనే ఆలొచనని, అత్యాసురుడిని చంపేయాలి.
ప్రతి అత్యాసురిడికి… మర్మస్థానం కాదది వాడి జన్మస్థానం అని గుర్తుకు రావాలి.
“యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః”

నేను దెయ్యాల్ని నమ్మను… అప్పటి వరకు

డిసెంబర్ 13 గురువారం.

రాత్రి 11:45

ఆఫీస్ నుండి కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యి బయలుదేరేసరికి లేట్ అయ్యింది ఆ రోజు. లాప్ టాప్ బాగ్ లొ పెట్టుకుంటూ ఇంటికి ఫోన్ చెసి చెప్పాను బయలు దేరుతున్నానని…
ఆ టైం లో ట్రాఫిక్ పెద్దగా లేక పోవడంతో ఏడు నిమిషాల్లొ హైటెక్ సిటి MMTS స్టేషన్ వరకు వచ్చేసాను.

ట్రైన్ ట్రాక్ కింద నుండి వెళ్ళే రోడ్ ఒక స్మశానం గుండా మెయిన్ రోడ్ లొ కలిస్తుంది. ఈ స్మశానం MMTS స్టేషన్ వెనక ఉంది. నాకు తెలిసినప్పటినుండి దీనికి ఎప్పుడూ ప్రహరీ గోడ లేదు.  అందువల్ల రొడ్డుకి దగ్గరలో శవాలని తగలబెట్టడం కనిపిస్తుంది అప్పుడప్పుడు.

11:52

“మరణమునే స్మరణముగా.. కదనములొ వేటాడే..
రళగళమే నిగళముగా.. ప్రాణముతో ఆటాడే…”

స్టీరియోలో ఆరవింద్ – 2 లో పాట హై వాల్యుం లో వస్తుంటే నా కార్ వేగంగా ట్రైన్ బ్రిడ్జ్ ని దాటింది. రోడ్డు మీద ఎవరూ లేరు అన్న ధైర్యంతో అనుకుంట నా కార్ ఎంత వేగం తో వెళ్తుందో కూడా నేను గమనించలేదు. కాని  యాక్సలిరేటర్ మీదున్న నా కాలికి మాత్రం తెలుసు..

కార్ హైభీం వెలుతురులో ఒక వ్యక్తి సైకిల్  మీద ఎదురుగా వస్తూ కనిపించాడు. నేను ఒక్కసారిగా బ్రేక్ నొక్కాను. అప్పటికే ఆలస్యం అయ్యింది. కార్ గుద్దుకున్నట్లు ఆగి పొయింది.

అంతా నిశ్శబ్దం…
నా గుండె చప్పుడు నాకే వేగంగా కొట్టుకొవడం వినిపించింది.

ఏమి చెయ్యలో తోచడం లేదు. కార్ దిగడనికి నా మనసు అంగీకరించడం లేదు.
కార్ బానెట్ మీదగా చూసా ఎమైనా కనిపిస్తుందేమోనని…

లో భీం లైట్స్ వేశా. అప్పుడు కార్ బంపర్ కింద ఉన్న సైకిల్ కొద్దిగా కనిపించింది.
నాలో భయం మొదలైంది.

నేను గుద్దిన వేగానికి ఖచ్చితంగా మనిషి బ్రతికే చాన్స్ లేదు. కొన ప్రాణంతో ఉంటే కనీసం మూలుగు వినిపిస్తుందేమోనని, మెల్లగా విండో గ్లాస్ కిందకి దించాను. అప్పటి వరకు అద్దం బయట కాచుక్కుచున్నట్లు చల్లగాలి ఒక్కసారిగా లోపలికి వచ్చి నన్ను తాకింది.

బయటకి చూసాను.
కార్ దిగి చూడటానికి ఒకటికి రెండు సార్లు ఆలొచించి, మెల్లగా డొర్ తీసుకొని కిందకి దిగాను.
అంతే… ఒక్కసారిగా ఎవరో స్మశానం లోకి పరిగెత్తినట్లనిపించింది. ఎవరా అది అని నేను అటువైపు చూసాను.

రోడ్డుకి ఆనుకునివున్న స్మశానం నిశ్శబ్దంగా వుంది. నక్కలు వుండే అవకాశం లేదు కనుక అరుపులు వినిపించడం లేదు. జీవితంలో అలసిపొయిన ఎన్నో జీవితాలు అక్కడ ప్రశాంతంగా నిద్ర పొతున్నాయి. కొత్తగా అక్కడ చేరిన వాళ్ళ సమాధులు చంద్రుని వెలుగులో తెల్లగా మెరుస్తున్నాయి. స్మశాన నిశ్శబ్దం అంటే ఎంటో అప్పుడు నాకు పూర్తిగా అర్దమయ్యింది.

కాని ఆ నిశ్శబ్దం లో నేను మత్రమే కాదు.. నాతో ఇంకా ఎవరో ఉన్నారన్న ఆలోచన అంగీకరించే పరిస్థితిలో నేను లేను.

అప్రయత్నంగా కార్ బంపర్ వైపు చూసిన నాకు అక్కడ సైకిల్ కనిపించలేదు. ఇంక నాకు తప్పలేదు పూర్తిగా భయానికి లొంగిపోక…

ఎంత వేగంగా కార్ లో కూర్చున్నానో అంతే వేగంగా డోర్ లాక్ చేసి, విండో గ్లాస్  పైకి లేపాను.
త్వరగా అక్కడినుండి వెళ్ళాలన్న నా ప్రయత్నాన్ని ఎవరో ఆపుతున్నట్లు… కార్ స్టార్ట్ కాలేదు.. నేను నా ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు.

అంతలో బ్యాక్ డోర్ ఒక్కసారి ఒపెన్ అయ్యి క్లొజ్ అయ్యింది… ఎవరో బ్యాక్ సీట్లో కూర్చున్నట్లు అనిపించింది. మరుక్షణం ఆశ్చర్యంగా కార్ స్టార్ట్ అయ్యింది.

**************

ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా కార్ వేగాన్ని అందుకుంది.
వెనక నుండి ఏవో మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. వెనక్కి తిరిగి చూడలేకపొయాను. స్టీరియో వాల్యుం పెంచాను. వెంటనే ఎవరో తగ్గించినట్లు వాల్యుం తగ్గిపొయింది. మళ్ళీ వాల్యుం పెంచే ధైర్యం నాకు లేక పోవడంతో వెనక నుండి వచ్చే సన్నని శబ్దాలను వినక తప్పలేదు.

తేదీ మారింది. సమయం 00:04
మైయిన్ రోడ్డెక్కి ఒక ఐదు నిమిషాలు ప్రయాణిచానో లేదో… ఒక ఫుటొవర్ బ్రిడ్జ్ దగ్గరకి వచ్చేసరికి.. కార్ పెద్ద శబ్దంతో ఆగి పొయింది…

ఇంక భయపడే ఓపిక నాకు లేదు. అంతే కాక ఒక రకమైన మొండి ధైర్యం కూడా వచ్చింది. వెనక్కి తిరిగి పెద్దగా అరుద్దామనిపించింది.
మళ్ళీ వెనక డోర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యింది… ఎవరో కిందకి దిగి పొయినట్లు..

నా ప్రమేయం లేకుండా జరుగుతున్న సంఘటనలను గమనించడం తప్ప ఏమీ చెయ్యలేకపొతున్నాను. ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే ఉన్నానేమో అన్న భావన నన్ను మరింత కృంగదీసింది. ఈసారి మొదటి ప్రయత్నం తోనే కార్ స్టార్ట్ అయ్యింది.

అక్కడి నుండి వీలైనంత త్వరగా వెళ్ళి పోవాలన్న తొందర నా కాలికి బుద్ది చెప్పడంతో యాక్సిలిరేటర్ మీద ఒత్తిడి పెరిగింది.

***************

మర్నాడు ఉదయం.
టైమెంత అయ్యిందో కాని నిద్రలేచేసరికి రోజు మీదబాగా ఆలస్యం అయ్యింది. రాత్రి జరిగిందంతా ఒక్కసారి గుర్తుకువస్తే అది కలైతే బాగుండునని పించింది. మా ఆవిడ నన్ను తరమడంతో ఆఫీస్ కి తయారవ్వడానికి బాత్రూం లోకి దూరాను.

ఒక ఇరవై నిమిషాల్లో ఆఫీస్ కి బయలుదేరాను.
కధ ఇంతటితో అయిపొతే బాగుండేది. కాని ఆ తర్వాత జరిగిన సంఘటనలు ముందు రోజు జరిగింది కల కాదు అనే విషయాన్ని పదే పదే గుర్తు చేశాయి.

మధ్యాహ్నం 12:02

నా కార్ స్మశానం మీదుగా వెళ్తుంది. నేను వద్దన్నాగాని నా కళ్ళు స్మశానం లో కి చూసాయి. అక్కడ….

నలభై ఐదు యాభై మధ్య ఉంటాయనుకుంటా వయస్సు… ఒక వ్యక్తి నిల్చొని నా వైపే చూస్తున్నాడు.
అతని పక్కనే ఒక సైకిల్ పడి వుంది. నేను వెంటనే నా చూపు పక్కకు తిప్పుకున్నాను.

కొంచెం ముందుకు వెళ్ళి సైడ్ మిర్రర్ లో చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.

(అయిపోయింది)

టీవి పంచాయితీలు..

ఒక శనివారం ఉబుసుపోక టీవి ఆన్ చేశా. మాములుగా అయితే ఏదో ఒక సినిమా వేసుకొని చూస్తాను. ఆ రోజు నా గ్రహస్థితి బాగోలేకేమో న్యూస్ చానల్ పెట్టుకున్నాను.

అలవాటు ప్రకారం బ్రేకింగ్ న్యూస్ అంటూ ఏదో హడావుడి చేస్తున్నారు. ఈ మద్య ప్రతి చిన్న విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ గా వెయ్యడం ఫ్యాషన్ అయ్యింది. మెన్నామధ్య పంది మీద కొతి కూర్చొని తిరుగుతుందని బ్రేకింగ్ న్యూస్ గా వేశారు.  నాకర్దం కాలేదు అందులో ఏమి బ్రేకింగ్ విషయం వుందో అది ఎంతవరకు జనాలకి అవసరమో..

ఇంతకీ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే…  “కొడల్ని వేదిస్తున్న మామ. సర్ధుకుపొమ్మన్న అత్త. సమర్దించిన భర్త.”

“అరే ఇది కుటుంబ సమస్య కదా.. టీవి వాళ్ళకి ఎలా తెలిసింది. చూడబోతే వేదింపుల కేసు లాగా వుంది. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లోనో పెద్దల సమక్షంలోనో తేల్చుకోవలసిన విషయం. టీవీ వాళ్ళు ఏమి చేస్తారు.” ఆశ్చర్య పోయాను.

“మీరు బాదితురాలు తో మాట్లాడలనుకుంటే మా టీవీ కి కాల్ చెయ్యండి. మరో 10 నిముషాల్లో సరిత (బాదితురాలు) ముందుగా మన చానల్లోనే మాట్లాడటనికి సిద్దంగా వుంది.” ఇంకో స్క్రోలింగ్.

ఇప్పుడు నాకు కొంత అర్ధమయ్యింది. ఈమే నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా  టీవీ చానల్ వాళ్ళని ఆశ్రయించింది. ఎందుకు?..
వాళ్ళేమైనా ఆమె పుట్టింటివాళ్ళా?..
ఇలాంటి సమస్యలు పరిష్కరించమని మన ప్రభుత్వం నియమించిన వాళ్ళా?..
సరిత నమస్య మీద వాళ్ళకున్న ఆసక్తి ఎంత? ఎందుకు?..
నిజంగానే మెరుగైన సమాజం కోసమా?..

ఇలాంటి ప్రశ్నలు నన్ను వేదిస్తున్నంతలో..టీవీ స్క్రీన్ మీద చర్చా వేదిక సిద్దం అయ్యింది.
ఒక అమ్మాయి (బాధితురాలు) కళ్ళు మాత్రమే కనపడేలాగా ముఖానికి చున్నీ కట్టుకొని వుంది. బ్యాక్ గ్రౌండ్ లో “మగాళ్ళా? మృగాళ్ళా?” అని ఎర్రటి అక్షరాలతో రాసిన పోస్టర్.

“నమస్కారం. తనకు జరుగుతున్న అన్యాయాన్ని ధైర్యంగా(?) ఎదుర్కొని మన చానల్ కి వచ్చి మనతో తన అనుభవాన్ని(?) పంచుకోవడానికి సిద్దంగా వున్నారు.” తనదైన దోరణిలో మొదలు పెట్టాడు టీవీ రిపోర్టర్.
“చెప్పండి సరిత గారు. మిమ్మల్ని ఏ విదంగా వేదించేవారు మీ అత్తింటివారు.”

సరిత ఆమె తన బాధలను వివరించడం మొదలు పెట్టింది.
ఇంతలో టివి స్ర్కీన్ మీద మొదలైంది ఎస్ ఎం ఎస్ రిక్వెస్ట్.

ఇదో పెద్ద వ్యాపారం. (ఎస్ ఎం ఎస్ కి 6 రూపాయిలు మాత్రమే.)

హైదరా’బాద’లు..

ఒక శనివారం. భాగ్యనగరం అలియాస్ హైదరాబాద్.

తెల్లవారుజామున 10.30 అయ్యింది. (నాకది తెల్లవారుజామే..)

బద్దకంగా నిద్ర లేచాను.

న్యుస్ పేపర్ అందుకొని కుర్చీలో కూలబడ్డాను.

చందు గాడు వస్తానన్నాడు. వాడి కోసం అప్పుడప్పుడు బయటకి చూస్తున్నాను. చప్పుడైతే వాకిటి వైపు చూశాను.

వాకిట్లో ఎవడో వళ్ళంతా కట్లతో, మొహాన అక్కడక్కడ బ్యాండెజ్ వేసుకొని ఈజిప్ట్ మమ్మీ లాగా నుంచొని ఉన్నాడు.

YCAM

ఎదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు.

“ఇంట్లో ఎవరూ లేరు బాబు. పక్క ఫ్లాట్ కి వెళ్ళు.” అన్నాను.

వాడు లోపలికి వచ్చేశాడు. టేబుల్ మీద ఉన్న నా పర్స్ తీసుకున్నాడు.

నా చేతి నరం ఉబ్బటం మెదలైంది,”రక్షకుడు” సినిమాలో నాగార్జునకి లాగా …

ఒక్క గెంతులో వాడి దగ్గరకు వెళ్ళాను. కాని ఎక్కడ కొట్టాలో తెలియడం లేదు. వాడి వళ్ళంతా పొట్లాం కట్టినట్లు కట్టారు.

నా ఆలోచనని గమనించిన వాడు నన్ను ఆగమని సైగ చెశాడు. నేను ఆగి పోయాను.

(గమనిక: ఈ క్రింద చెప్పిన సాహసాలు అనుభవజ్ఞుల పర్యవేక్షణలో చేయబడినవి. మీరు చేయటానికి ప్రయత్నిచవద్దు అని మనవి. ఒకవేళ చేసి గాయపడినట్లైతే  మేము భాద్యులము కాము.)

వాడు ఎడమ కాలు కుడి చెయ్యి గాల్లొ లేపి గుండ్రంగా తిరగసాగాడు.

నాకు నిద్రమత్తు పూర్తిగా వదిలి పోయింది. 

” అదే సిగ్నల్ ” ” అదే సిగ్నల్ ”

మా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు ఇలా చేస్తుంటాము (అదేదో సినిమాలో ఫ్యామిలీ సాంగ్ పాడుకొన్నట్లు…). జాగ్రత్తగా చూశాను.

“ఒరే చందుగా!” బయటకే అరిచాను.

“అవును” అన్నట్లు దీనంగా మూలిగాడు.

“ఏమయిందిరా? ఎక్కడ పడ్డావురా? ఎప్పుడు జరిగిందిరా?” టివి యాంకర్ లా వాడిని నా ప్రశ్నలతో పొడిచాను.

బయటనుండి ఆటో హారన్ వినిపించింది.

“ముందు వాడిని పంపించు” అన్నట్లు చూశాడు చందు.

చందుని సోఫాలో దిగబెట్టి గబగబా కిందకు దిగి ఆటో దగ్గరకు వెళ్ళాను.

“ఎంత అయ్యింది బాబు?”

“పది రూపాయలు.”

నేను వంద రూపాయలు ఇచ్చి వెనక్కి తిరిగాను.

“సార్! మీరు విన్నది కరెక్టే నాకు ఇవ్వాలసింది పది రూపాయలే” అని మిగతా తొంబై నా చెతిలో పెట్టి ఆటో స్టార్ట్ చేశాడు.

“నేను ఉంది హైదరాబాద్ లోనేనా? చందు వచ్చింది ఆటోలోనేనా? ఈ రోజు ‘ ఆట ‘ ఫైనల్స్ ఎవరు గెలుస్తారు? ‘ దిక్కుమాలిన బ్రతుకులు ‘ ఇంకా ఎన్ని సంవత్సరాలు సాగుతుంది? నేను అసలు ఎవరిని?”

ఆటో వదిలిన పొగ నా నోట్లోకి.. నేను ఈ లోకం లోకి.. వచ్చి పడ్డాము.

అంతలో పైనుండి పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఒక అరుపు వినిపించింది. ఇక నేను ఆగలేదు. ఇంట్లోకి దూసుకొని వెళ్ళాను.

చందు సోఫాలో లేడు. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో కొమ్మలు నరికిన చెట్టు లాగా ఫిడ్జ్ దగ్గర పడున్నాడు.

“మంచి నీళ్ళు కావాలంటే నేను వచ్చే వరకు ఆగొచ్చు కదా?” వస్తున్న నవ్వాపుకుంటూ వాడిని బెడ్ మీద పడుకోబెట్టాను. వాడు కృతజ్ఞతగా చూశాడు.

“అవున్రా.. ఆటో వాడు పది రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. పక్క వీదిలో గాని పడ్డావా? వాడు నీ ఫ్రెండ్ కి ఫ్రెండా? నీ మీద జాలి చూపించాడా? కొంపదీసి వాడే నిన్ను పడేశాడా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేదో నీ తల వెయ్యి ముక్కలు అవుతుంది.” అని ఒక భేతాళ ప్రశ్న వేశాను.

ఇక మాట్లాడకుండా ఉండలేక పోయాడు చందు.

“ఆ పది ఎక్స్ ట్రా రా” బాధగా అరిచాడు.

“ఓహొ మీటర్ మీద పది రూపాయలు తీసుకున్నాడా?” నేను పెద్దగా ఆశ్చర్య పోలేదు ఎందుకంటే అది కామన్ కాబట్టి.

“ఈ నెల జీతం మీద పది రూపాయలు తీసుకున్నాడు.” వాడికి ఏడుపొచ్చింది. నాకు జాలేసింది.

“అసలేమి జరిగిందిరా?”

పక్కనే ఉన్న మస్కిటో కాయిల్ ఒకటి తీసుకొని నా మొహం మీద పెట్టి తిప్పుతూ, “నేను ఒకటో తరగతి చదివే రోజుల్లో…”

“ఒరే.. ఈ రోజు ఏమి జరిగిందో చెప్పరా…”

“నీకు తెలుసు కదా..నాకు ఎదైనా మొదటి నుండి చెప్పడం అలవాటని…”

“నీకు దణ్ణం పెడతాను. ఈ రోజు జరిగింది మాత్రమే చెప్పరా..” వాడి కాళ్ళ మీద పడినంత పని చేశాను.

మస్కిటో కాయిల్ని సగానికి తుంచాడు. “నేను డిగ్రీ చదివే రొజుల్లొ…”

నేను వాడి చేతిలో కాయిల్ని లాక్కొని విరిచి ఒక చిన్న ముక్క చేతిలో పెట్టి “ఇప్పుడు చెప్పు” అన్నాను.

“ఈ రోజు ఏంజరిగిందంటే..”

“హమ్మయ్య…” అనుకున్నాను.

“…పొద్దున్నే నీ దగ్గరకు వద్దామని రాత్రే అలారం పెట్టుకుని పడుకున్నాను. మలక్ పేట్ నుండి కూకట్ పల్లి రావాలంటే కనీసం ఆరేడు గంటలైనా పడుతుంది కదా. అలారం కంటే ముందే భయంకరమైన మూసీ వాసన ముక్కుకు తగిలి నిద్ర లేచాను. ఆ వాసన నాకు అలవాటై పొయిందిగాని ఇంకొకరైతే.. చెయ్యి కోసేసుకొని, మెడకు ఉరేసుకొని, ఒక మూత పురుగులు మందేసుకొని, కరెంట్ ప్లగ్గులో వేలెట్టేసుకొని చచ్చేవాళ్ళు. గబగబా బెడ్ మీద నుండి లేచి, మొహం కడుక్కుందామని టాప్ తిప్పి దాని కింద చెయ్యి పెట్టాను. తుఫానుకు ముందులాగా గాలి వచ్చింది. కొద్ది సేపటికి నీళ్ళు రావడం మొదలయ్యాయి. మొహం మీద చల్లుకున్నాను. నొట్లో కొంచం పోసుకున్నాను. నేను చిన్నప్పుడు శీనుగాడి దగ్గర కొట్టెసి తిన్న జీడి కూడా బయటకు వచ్చేటట్లున్నాయి ఆ నీళ్ళు. నాకు అలవాటై పోయింది కాని..”

“సోది ఆపి అసలు విషయం చెప్పరా..”

“నీకు సోది లాగే ఉంటదిరా నా హైదరాబాదలు.”

“ఒప్పుకుంటానుగాని తర్వాత ఏమైంది చెప్పు.”

“…ఆవిదంగా నిద్ర లేచి ఫ్రెష్ గా ఉన్న నేను ఆ నీళ్ళతో స్నానం చేసి ఒంటికి మురికి పట్టించుకున్నాను. రూం కి తాళం వేసి పార్కింగ్ లోకి వచ్చాను. మొహానికి ఒకటి, తలకి ఒకటి కర్చిఫ్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేశాను. మా సందు తిరిగి మెయిన్ రొడ్ మీదకు ఎక్కుతుండగా..అక్కడంతా పొగ కమ్ముకొని ఉంది. కొంచం కష్టంగానే ఆ పొగలోగి వెళ్ళాను. అంతలో ఎవరో డబ్బాలో గులక రాళ్ళు వేసి కొడుతున్నట్లు శబ్దం వినిపించింది. మున్సిపాలిటి వాళ్ళు దోమలమందు కొడుతున్నారేమో అనుకున్నాను. కాని అది ఒక ఆటొ అని దాన్ని దాటి వెళ్తుంటే తెలిసింది. కొంచం ముందుకి వెళ్ళగానే ట్రాఫిక్ కిలోమీటరు దూరం ఆగి ఉంది. నేను బ్రేక్ వేశాను. నా వెనకాలే ఒక సిటి బస్సు గుద్ది నంత పని చేస్తూ ఆగింది. ఆ శబ్దానికి కోపంగా వెనక్కి తిరిగి చూశాను. దానికి సమాధానంగా బస్సు నన్ను గుద్ది ఆగింది. ఇక లాభంలేదనుకొని…”

“కొంపదీసి వాడితో గొడవ పడ్డావా ఏంటి.. నేను ముందే అనుకున్నాను.. నీ సొట్టపోయిన మొహం చూసి.. వాళ్ళే నిన్ను కొట్టారని..”

“..అంత సీన్ లేదురా. నేను అంత చాన్స్ ఇవ్వలేదు. ఆగి ఉన్న వెహికల్స్ మద్య నుండి సందుల్లో దూరుతూ అక్కడనుండి జారుకున్నాను. నా తెలివికి నాకే ఆనందం వేసింది. కాని నా ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఎదురుగా ట్రాఫిక్ పోలిస్ నుంచొని వున్నాడు. నన్ను ఆపాడు.

“లైసెన్స్ తీయ్.” “ఇన్స్యూరెన్స్ తీయ్.” “పొల్యూషన్ చెక్ తీయ్.” అని నా ప్రాణం తీశాడు.

అన్నీ చూపించాను.

“హెడ్ లైట్కి నల్ల రంగు లేదు. 500/- తీయ్.”

“అంత డబ్బులు నా దగ్గర లేవు సార్. ఉంటే హెడ్ లైట్కి నల్ల రంగు వేయించుకొనే వాడిని.” కొంచం అతితెలివి చూపించాను.

“నీకు రసీదు కావాలంటే 500/- వద్దనుకుంటే 100/-” అని ఒక ఆషాడం ఆఫర్ ఇచ్చాడు.

నాలొని భారతీయుడు ఒక్కసారిగా జూలు విదిలించాడు. బెల్ట్ మీద చెయ్యి వేశాను (కత్తి కోసం).

అప్పుడు గుర్తుకు వచ్చింది హడవిడిలో బెల్టు పెట్టుకోవడం మరచిపోయానని. ఐనా నాలో ఆవేశం చల్లారలేదు.

“నేను నీకు పావలా కూడా ఇవ్వను. ఏమి హీక్కుంటావో హీక్కో..”

ఇంకా ఎదో చెప్పబొతుంటే మద్యలోనే ఆపాను.

“ఓహొ పోలీసులు కొట్టారా నిన్ను..”

“వాళ్ళకి అంత సీన్ ఇస్తానా..”

“మరి తర్వాత ఏమి జరిగింది?”

“ఏముంది. నేను MMTS స్టేషన్ కి.. నా బండి పోలిస్ స్టేషన్ కి..”

“నువ్వెప్పుడూ అంతేరా..కానిస్టేబుల్ తో పోయేదాన్ని ఎస్.ఐ. దాకా తెచ్చుకుంటావు. తర్వాత ఏం జరిగింది. ”

“నాకు తోడుగా చాలా మందున్నారు స్టేషన్లో. ట్రైన్ వచ్చిన వేంటనే  ఆవేశంగా రన్నింగ్ లో ట్రైన్ ఎక్కాను. కొంతమంది నన్ను ముందుకు తొస్తే, కొంతమంది వెనక్కు తన్నారు. ఎలాగోలా లొపలికి ఎక్కాను. నా బాడి వచ్చింది కాని పర్సు పోయింది.”

“అయ్యో! డబ్బులు ఏమైనా ఉన్నాయా?”

“పెద్దగా లేవు గాని.. క్రెడిట్ కార్డు ఉంది. బ్లాక్ చేద్దామని కస్టమర్ కేర్ కి కాల్ చేశాను.”

“బ్లాక్ చేసారా?”

“ప్రస్తుతం మా సర్వర్ లన్నీ పడుకుని ఉన్నాయి. ఒకటిరెండు రోజులు ఆగి మీ అదృష్టాన్ని పరిక్షించుకొండి. అని పెట్టేశారు. దొంగ నా.. @#$@%!%@$^&^$^&^$&%@#%#&^$&^$&$%&”

(ఇక్కడ కొన్ని తిట్లు కూడా వాడటం జరిగింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటిని తొలగించటం జరిగింది. గమనించగలరు.)

“ట్రైన్ దిగిన తర్వాత కూడా నేను మాత్రం కాల్ చేయడం ఆపలేదు. వాళ్ళని కార్డ్ బ్లాక్ చెయ్యమని అడుగుతూనే ఉన్నాను. అలా రోడ్డు మీద మాట్లడుతూ వెళ్తున్న నాకు పడేదాకా తెలియలేదు… అక్కడ ఒక మ్యాన్ హొల్ ఉందని, అది మన మున్సిపాలిటి వారి సౌజన్యంతో తెరవబడి ఉందని.”

“వార్నీ..మ్యాన్ హొల్లొ పడ్డావా? మన హైదరాబాద్ లో మ్యాన్ హొల్లో పడి బ్రతికి బయటపడ్డవా? నిజంగా నువ్వు అదృష్టవంతుడివిరా. అసలు ఎలా బయటపడ్డావ్?”

“నన్ను ఫాలో అవుతూ వస్తున్న వొడాఫొన్ కుక్క(మాజీ హచ్ కుక్క) మ్యాన్ హొల్ చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. మొదట నాకు కంగారు వేసింది. తర్వాత భయం వెసింది. పెద్దగా అరవటం మొదలుపెట్టాను. కొంతసేపటికి బయటనుండి గోల గోలగా మాటలు వినిపించసాగాయి. నేను అరవడం ఆపి విన్నాను.”

“మనం అందరికంటే ముందుగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది స్వప్న. ఇక్కడ కుక్క ఒకటి మ్యాన్ హొల్ చుట్టూ తిరగడం చూసిన స్థానికులు 108 కంటే ముందుగా మనకే ఫోన్ చేసి పిలిచారు స్వప్న. ఇక్కడ మనం చూస్తున్నది.. ఒక వ్యక్తి మ్యన్ హొల్ లో పడి ఉన్నాడు. సహాయం కోసం బాదగా అరుస్తున్నాడు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు స్వప్న.”

నాకు అప్పటికి పూర్తిగా అర్దమయ్యింది. నా ప్రాణంతో మీడియా పండగ చేసుకుంటుందని.

“ప్రభుత్వం కోసం ఆగక పోతే నువ్వే నన్ను బయటకు లాగొచ్చు కదా?” ఇంకా పెద్దగా అరిచాను.

“సారి సార్.. చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోకూడదు.” అని బయటనుండి సమాదానం వచ్చింది.
అడిగిన ప్రశ్నకు సంబందం లేని సమాధానం వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా న్యూస్ చానల్ విలేకరేనని అర్ధమయ్యింది.
కొంతసేపటికి ఎవరో మున్సిపాలిటి వాళ్ళు లోపలికి దిగి నన్ను పైకి లాగారు. ఆ టైం లో వాళ్ళు దైవదూతల్లా కనిపించారు నాకు.

“ఆ తర్వాత ఎమి జరిగిందో నీకు నేను చెప్పనవసం లేదు.” అని ముగించాడు చందు వాడి హైదరాబాదలని.

“ప్రపంచంలో ఒక్క హైదరాబాదీకి తప్ప ఎవరికీ రావురా ఇన్ని కష్టాలు. ఒక్కరోజులోనే నువ్వు అన్నీ అనుభవించావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా..” అని వాడిని సముదాయించే ప్రయత్నం చేశాను.

వాడు ఎదో చెప్పేంతలో..

“ప్రపంచంలొ అన్ని కష్టాలు మీకే వచ్చాయనుకుంటున్నారా? ఈ మధ్య ఎక్కువగా మీకే ప్రమదాలు జరుగుతున్నయా? మీ అదృష్టం సరిగా లేదనుకుంటున్నారా? మీకు రావలసిన అవకాశాలు మీ శత్రువులకు అందుతున్నాయా?…”

నాచేతిలో టివి రిమోట్ లాక్కుని వాల్యుం పెంచాడు చందుగాడు.

టివిలో (ఈ మద్య సినిమాలు లేని హీరోయిన్) ఒకావిడ, చేతిలో ఒక ఉంగరం పట్టుకొని ఇంకా ఎదో చెప్తుంది. స్క్రీన్ మీద ఏవో ఫోన్ నంబర్లు స్క్రొల్ అవుతున్నాయి.

ఆ ఉంగరం మీద పడిన మెరుపు చందుగాడి కంట్లో మెరిసింది. వాడు మొబైల్ అందుకొన్నాడు.

(ఇక్కడ నుండి చందు రంగు రాళ్ళ కధ మొదలు అవుతుంది. రంగు పడుద్ది (రాళ్ళు కొంటే..) మీ కోసం త్వరలో మన ఇంద్ర లోకంలో)

రా.నా. స్టుడియోలో ఒక రోజు

నాకు సినిమాలంటే పిచ్చి.

పిచ్చి అంటే మాములు పిచ్చి కాదు.

హిట్ ఐన సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయని చూస్తే.. ఫ్లాప్ ఐన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయని చూస్తాను.

ఆ పిచ్చికొద్ది..అప్పుడప్పుడు స్టుడియోలకి వెళ్తుంటాను. ఈవిధంగా స్టుడియోలకి వెళ్ళడం వల్ల జ్ఞానం పెరుగుతుందని గీతలో గాడ్ కృష్ణ చెప్పాడు.

ఎప్పుడు చెప్పాడు అని గీత గీసి వెతికేరు. మీకు కనిపించదు.

ఇలా వెళ్ళడం వల్ల నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ కొసం….
1) మన “మూవీ మొగల్” రామానాయుడి గారి పేరు నుండి ‘రా’ ‘నా’ అక్షరాలను తీసి ఆయన మనవడికి (సురేష్ బాబు కొడుకు) “రాణా”
అని పేరు పెట్టారని ఇండస్ట్రీ టాక్.
2) మన టివీలో చూసే డాన్స్ కాంపిటెషన్స్, సింగింగ్ కాంపిటెషన్స్ కూడా సినిమా షూటింగ్ లాంటిదే. జడ్జెస్ మాత్రం ఒక గంట ఉండి వాళ్ళ షూటింగ్ చేసుకొని వెళ్ళిపొతారు. ఆ తర్వాత దాన్ని మిక్స్ చేసి మన మీదకు వదులుతారు. అది మనవాళ్ళకి తెలియక అంతా నిజమేమోనని ఒకటే ఏడుపులు పెడబొబ్బలు..

మా గురువు గారు ఒకాయన రా.నా స్టుడియోలో పని చేస్తున్నారు. అదేనండి.. మన రామానాయుడు స్టుడియోలో.

మూడు మార్నింగ్ షోలు ఆరు మాట్నీలు ఎనిమిది ఫస్ట్ షోలు పదహారు సెకండ్ షోలుగా నా జీవితం సాగిపోతున్న రొజుల్లో…

ఒక రోజు రా.నా.స్టుడియోకి నేను వెళ్ళబడ్డాను.

మెయిన్ గేటు దాటి లోపలికి వెళ్ళగానే నా చెవులకు సినిమా గాలి తగిలింది.

ఎదో సినిమా సాంగ్ తీస్తున్నట్లున్నారు. ఒకతను మెగాఫోన్ పట్టుకొని పెద్దగా నెంబర్లు అరుస్తున్నాడు. జూ.డాన్సర్స్ కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నారు.

అతన్ని నేను గుర్తుపట్టాను. ఒక డాన్స్ ప్రోగ్రాంలో మైకు ముక్కు దగ్గర పెట్టుకొని తెలుగుని తమిళ్ లో మాట్లాడుతుంటాడు.

నేను ఈ మధ్య రెండు మూడు సార్లు టివీలో ఆ ప్రొగ్రాం చూశాను.

నన్ను గుర్తుపడతాడేమోనని “నేను కాదు” అన్న బోర్డ్ మెహానికి తగిలించుకొని అక్కడ నుండి మెల్లగా జారుకున్నాను.

ఒక 20 అంతస్థుల బిల్డింగ్ సెట్టింగ్ వేసుంది అక్కడ.

మా గురువు గారు చెప్పారు..మన ‘ ఫైర్ స్టార్ – గిరి ‘ (పేరు మార్చడం జరిగింది) గారి సినిమా కోసం వేశారని. ఎదో ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నట్లున్నారు.

గొప్ప యాక్షన్ హీరోగా ఆయనకు పేరుంది. మాంచి ఫైటింగులు..చేజింగులు..జంపింగులు.. ఉన్న సినిమాలను జనాల్లో వదిలిన అనుభవం ఆయనది..

చిన్నప్పుడు.. అంటే నాకు ‘ఊహ ‘ తెలియనప్పుడు… నేను ఆయనకు భయంకరమైన విసనకర్రని (ఫ్యాన్ ని)… ( ఇవివి ‘ ఆమె ‘ సినిమాలో మొదటిసారిగా ‘ఊహ ‘ని చూసాను.)

ఫైటింగ్ అంటే నాకు భలే ఇష్టం. ఆయన ఫైట్ సిల్వర్ స్క్రీన్ మీద చూడటం తప్ప లైవ్ లో చూడలేదు.

అదృష్టం గజ్జి పట్టినట్లు పట్టడం వల్ల ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. 

ఆ సెట్టింగ్ ముందు ఎత్తుగా పరుపులు పేరుస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఇదేదో జంపింగ్ సీన్ అని నా సినిమా బుర్రకి గోకింది.

నాకు వచ్చిన ఈ అవకాశాన్ని వదల దల్చుకోలేక అక్కడ అన్నింటికంటే ఎత్తుగా ఉన్న గోడ మీదకి ఎక్కాను.

అక్కడనుండి అంతా బాగా కనిపించడంతో నన్ను నేను భుజం తట్టుకున్నాను.

ఫైట్ మాస్టర్ మైక్ పట్టుకొని ఎదో అరుస్తున్నాడు. మన హీరో 20వ అంతస్తు పిట్ట గోడ మీద నుంచొని రెడీగా ఉన్నాడు దూకటానికి.

నేను అలెర్ట్ అయ్యాను.

“యాక్షన్”

నేను దూకేశాను.

దూకినట్లు మూమెంట్ ఇచ్చిన మన హీరోగారు మాత్రం “కట్” అనడంతో కిందకి దిగి వచ్చారు.

లారీ టైర్ కింద పడిన కప్పలాగా ఉంది నా పరిస్థితి. మెల్లగా లేచాను.

“యాక్షన్” అని వినిపించింది.

నాకు ఇక ఓపిక లేదు.

ఈసారి మాత్రం మన హీరోగారు దూకేశారు. ఒక చిన్న స్టూల్ మీద నుండి పరుపు మీదకి…

సెట్ అంతా చప్పట్లతో మారుమోగింది. పదిమంది వచ్చి ఆయన్ను తీసుకొని వెళ్ళారు.

“ఈమాత్రం దానికి ఇంత పెద్ద సెట్ వెయ్యాలా? బాబుఖాన్ బిల్డింగ్ దగ్గర తీస్తే పోలా?” బయటకే కక్కాను.

“ఇది భారీ బడ్జెట్ సినిమా” అని మా గురువు గారు సెలవిచ్చారు.

మొదట భాధేసింది. తర్వాత నా మీద నాకే జాలేసింది.

అంతలో దూరంగా ఎదో సందడి కనిపిస్తే కాళ్ళను అటువైపు నడిపించాను. ఆ హడావిడి ప్రెస్ మీట్ కోసమని తెలిసింది.

ముంబాయి నుండి దిగుమతి చేసుకోబడిన హీరొయిన్ “గిల్లిపోనా” (అలవాటు ప్రకారం పేరు మార్చడం జరిగింది) ఎవరితోనో సెల్ ఫోన్ లో మెలికలు పోతుంది. ఆమె ముందు టెబుల్ మీద “హింది-తెలుగు-హింది” డిక్ష్టనరీ ఉంది.

ఒకతని మీద చాలా మంది వాలి ఎదో చెప్తున్నారు. అతను చేతులు గాల్లో దెన్నో రుబ్బుతున్నాయి.
మా గురువు గారు చెప్పారు.. ఆయన గొప్ప దర్శకుడని..ఆయన చుట్టూ మూగిన వాళ్ళు కధారచయితలని.. ప్రస్తుతం ఆయన కొత్త కధని రుబ్బుతున్నాడని…

ఒకాయన దెన్నో పోగొట్టుకున్నట్లు తిరుగుతున్నాడు. ఈయన నాకు తెలుసు. గొప్ప లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఈయన ప్రొడక్షన్ లో వచ్చాయి.
“మొదటి షెడ్యూల్ లో పోయిన డబ్బులు నువ్వు తిరిగి ఇస్తావా?” అని నన్ను నిలదీయడంతో అక్కడి నుండి పారిపొయిన నేను ప్రెస్ మీట్ మొదలయ్యే టైంకి వచ్చాను.

‘పసి హృదయాలు – మంచి కసి మీద ఉన్నాయి ‘ అనే బ్యానర్ కట్టి వుంది.

ముందుగా దర్శకుడు మైకందుకున్నాడు.
“ఇది ఒక డిఫెరెంట్ సినిమా. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, వాళ్ళింట్లో పనమ్మాయి మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరి. పనమ్మాయిగా మన రెష్మ ప్రదర్శన నటన సినిమాకే హైలెట్. కధ పాతదే ఐనా కధనం కొత్తగా ఉంటుంది. యాక్షన్ లవ్ సెంటిమెంట్ అన్నీ ఉన్న ఫ్యామిలి ఎంటర్ టైనర్. తప్పకుండా ఒక ఫీల్ గుడ్ సినిమాగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయటం ఖాయం. మన నిర్మాత గారు ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా…” అని ఇంకా ఎదో చెప్తున్నాడు.

నేను ఆ నిర్మాత వైపు చూశాను. సగం కాలిన బీడీని కాలితో తొక్కి ఆర్పినట్లు ఉంది అతని మొహం.

ఇక ఇప్పుడు మన గిల్లిపోనా వంతు.
తెందీ (తెలుగు + హింది) రానివారు సబ్ టైటిల్స్ చూడండి.
   “అండర్ కో ణమస్క రాం” అని తన పళ్ళు చూపించింది.
    (అందరికీ నమస్కారం)
  “ఈదో నేకి మడత సిన్మా”
    (ఇది నాకు మొదటి సినిమా.)
నా కధలో బూతులు రాయడం ఇష్టంలేక ఇక నుండి సబ్ టైటిల్స్ మాత్రమే రాస్తున్నాను.
“ఈ సిన్మాలో నాది ఒక బబ్లీ గర్ల్ క్యారెక్టర్. అందరినీ సరదాగా ఎడిపిస్తూ తిరుగుతూంటాను. నాకు అందరూ ఇక్కడ నచ్చారు. ఐ లవ్ హైదరాబాద్ బిర్యాని.” మళ్ళీ పళ్ళు చూపించింది.

ఇక నేను అక్కడ వుండలేక పోయాను.
మా గురువుగారిని సెలవు అడుగుదామని..
  “వళ్ళో వంగుతోము.”
     (వెళ్ళి వస్తాను)
అన్నాను తెందీలో.

****

చాలా రోజుల తర్వాత …

ఒక రోజు…

న్యూస్ పేపర్ చూస్తున్న నాకు “ఫ్యామిలీతో టాంక్ బండ్ దగ్గర తిరుగుతున్న ఒక నిర్మాతని ఆత్మహత్య చెసుకోబోతున్నాడేమోనన్న అనుమానంతో లేక్ పోలిస్ అరెస్ట్ చేశారు.” అన్న వార్త కనిపించింది.

ఆ వార్త కిందనే ఒక సినిమా పొస్టర్ వుంది.

మన ‘ఫైర్ స్టార్ ‘ గిరి ఈఫిల్ టవర్ మీదనుండి దూకుతున్నాడు.  

సినిమా టైటిల్ : ‘ఖడ్గమృగం – వీడు మనిషి కాడు ‘.

(అయిపోయింది.)

Previous Older Entries Next Newer Entries