ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం 10-Aug-2014

Hyderabadalu_page1 Hyderabadalu_page2

హైదరా’బాద’లు..

ఒక శనివారం. భాగ్యనగరం అలియాస్ హైదరాబాద్.

తెల్లవారుజామున 10.30 అయ్యింది. (నాకది తెల్లవారుజామే..)

బద్దకంగా నిద్ర లేచాను.

న్యుస్ పేపర్ అందుకొని కుర్చీలో కూలబడ్డాను.

చందు గాడు వస్తానన్నాడు. వాడి కోసం అప్పుడప్పుడు బయటకి చూస్తున్నాను. చప్పుడైతే వాకిటి వైపు చూశాను.

వాకిట్లో ఎవడో వళ్ళంతా కట్లతో, మొహాన అక్కడక్కడ బ్యాండెజ్ వేసుకొని ఈజిప్ట్ మమ్మీ లాగా నుంచొని ఉన్నాడు.

YCAM

ఎదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు.

“ఇంట్లో ఎవరూ లేరు బాబు. పక్క ఫ్లాట్ కి వెళ్ళు.” అన్నాను.

వాడు లోపలికి వచ్చేశాడు. టేబుల్ మీద ఉన్న నా పర్స్ తీసుకున్నాడు.

నా చేతి నరం ఉబ్బటం మెదలైంది,”రక్షకుడు” సినిమాలో నాగార్జునకి లాగా …

ఒక్క గెంతులో వాడి దగ్గరకు వెళ్ళాను. కాని ఎక్కడ కొట్టాలో తెలియడం లేదు. వాడి వళ్ళంతా పొట్లాం కట్టినట్లు కట్టారు.

నా ఆలోచనని గమనించిన వాడు నన్ను ఆగమని సైగ చెశాడు. నేను ఆగి పోయాను.

(గమనిక: ఈ క్రింద చెప్పిన సాహసాలు అనుభవజ్ఞుల పర్యవేక్షణలో చేయబడినవి. మీరు చేయటానికి ప్రయత్నిచవద్దు అని మనవి. ఒకవేళ చేసి గాయపడినట్లైతే  మేము భాద్యులము కాము.)

వాడు ఎడమ కాలు కుడి చెయ్యి గాల్లొ లేపి గుండ్రంగా తిరగసాగాడు.

నాకు నిద్రమత్తు పూర్తిగా వదిలి పోయింది. 

” అదే సిగ్నల్ ” ” అదే సిగ్నల్ ”

మా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు ఇలా చేస్తుంటాము (అదేదో సినిమాలో ఫ్యామిలీ సాంగ్ పాడుకొన్నట్లు…). జాగ్రత్తగా చూశాను.

“ఒరే చందుగా!” బయటకే అరిచాను.

“అవును” అన్నట్లు దీనంగా మూలిగాడు.

“ఏమయిందిరా? ఎక్కడ పడ్డావురా? ఎప్పుడు జరిగిందిరా?” టివి యాంకర్ లా వాడిని నా ప్రశ్నలతో పొడిచాను.

బయటనుండి ఆటో హారన్ వినిపించింది.

“ముందు వాడిని పంపించు” అన్నట్లు చూశాడు చందు.

చందుని సోఫాలో దిగబెట్టి గబగబా కిందకు దిగి ఆటో దగ్గరకు వెళ్ళాను.

“ఎంత అయ్యింది బాబు?”

“పది రూపాయలు.”

నేను వంద రూపాయలు ఇచ్చి వెనక్కి తిరిగాను.

“సార్! మీరు విన్నది కరెక్టే నాకు ఇవ్వాలసింది పది రూపాయలే” అని మిగతా తొంబై నా చెతిలో పెట్టి ఆటో స్టార్ట్ చేశాడు.

“నేను ఉంది హైదరాబాద్ లోనేనా? చందు వచ్చింది ఆటోలోనేనా? ఈ రోజు ‘ ఆట ‘ ఫైనల్స్ ఎవరు గెలుస్తారు? ‘ దిక్కుమాలిన బ్రతుకులు ‘ ఇంకా ఎన్ని సంవత్సరాలు సాగుతుంది? నేను అసలు ఎవరిని?”

ఆటో వదిలిన పొగ నా నోట్లోకి.. నేను ఈ లోకం లోకి.. వచ్చి పడ్డాము.

అంతలో పైనుండి పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఒక అరుపు వినిపించింది. ఇక నేను ఆగలేదు. ఇంట్లోకి దూసుకొని వెళ్ళాను.

చందు సోఫాలో లేడు. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో కొమ్మలు నరికిన చెట్టు లాగా ఫిడ్జ్ దగ్గర పడున్నాడు.

“మంచి నీళ్ళు కావాలంటే నేను వచ్చే వరకు ఆగొచ్చు కదా?” వస్తున్న నవ్వాపుకుంటూ వాడిని బెడ్ మీద పడుకోబెట్టాను. వాడు కృతజ్ఞతగా చూశాడు.

“అవున్రా.. ఆటో వాడు పది రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. పక్క వీదిలో గాని పడ్డావా? వాడు నీ ఫ్రెండ్ కి ఫ్రెండా? నీ మీద జాలి చూపించాడా? కొంపదీసి వాడే నిన్ను పడేశాడా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేదో నీ తల వెయ్యి ముక్కలు అవుతుంది.” అని ఒక భేతాళ ప్రశ్న వేశాను.

ఇక మాట్లాడకుండా ఉండలేక పోయాడు చందు.

“ఆ పది ఎక్స్ ట్రా రా” బాధగా అరిచాడు.

“ఓహొ మీటర్ మీద పది రూపాయలు తీసుకున్నాడా?” నేను పెద్దగా ఆశ్చర్య పోలేదు ఎందుకంటే అది కామన్ కాబట్టి.

“ఈ నెల జీతం మీద పది రూపాయలు తీసుకున్నాడు.” వాడికి ఏడుపొచ్చింది. నాకు జాలేసింది.

“అసలేమి జరిగిందిరా?”

పక్కనే ఉన్న మస్కిటో కాయిల్ ఒకటి తీసుకొని నా మొహం మీద పెట్టి తిప్పుతూ, “నేను ఒకటో తరగతి చదివే రోజుల్లో…”

“ఒరే.. ఈ రోజు ఏమి జరిగిందో చెప్పరా…”

“నీకు తెలుసు కదా..నాకు ఎదైనా మొదటి నుండి చెప్పడం అలవాటని…”

“నీకు దణ్ణం పెడతాను. ఈ రోజు జరిగింది మాత్రమే చెప్పరా..” వాడి కాళ్ళ మీద పడినంత పని చేశాను.

మస్కిటో కాయిల్ని సగానికి తుంచాడు. “నేను డిగ్రీ చదివే రొజుల్లొ…”

నేను వాడి చేతిలో కాయిల్ని లాక్కొని విరిచి ఒక చిన్న ముక్క చేతిలో పెట్టి “ఇప్పుడు చెప్పు” అన్నాను.

“ఈ రోజు ఏంజరిగిందంటే..”

“హమ్మయ్య…” అనుకున్నాను.

“…పొద్దున్నే నీ దగ్గరకు వద్దామని రాత్రే అలారం పెట్టుకుని పడుకున్నాను. మలక్ పేట్ నుండి కూకట్ పల్లి రావాలంటే కనీసం ఆరేడు గంటలైనా పడుతుంది కదా. అలారం కంటే ముందే భయంకరమైన మూసీ వాసన ముక్కుకు తగిలి నిద్ర లేచాను. ఆ వాసన నాకు అలవాటై పొయిందిగాని ఇంకొకరైతే.. చెయ్యి కోసేసుకొని, మెడకు ఉరేసుకొని, ఒక మూత పురుగులు మందేసుకొని, కరెంట్ ప్లగ్గులో వేలెట్టేసుకొని చచ్చేవాళ్ళు. గబగబా బెడ్ మీద నుండి లేచి, మొహం కడుక్కుందామని టాప్ తిప్పి దాని కింద చెయ్యి పెట్టాను. తుఫానుకు ముందులాగా గాలి వచ్చింది. కొద్ది సేపటికి నీళ్ళు రావడం మొదలయ్యాయి. మొహం మీద చల్లుకున్నాను. నొట్లో కొంచం పోసుకున్నాను. నేను చిన్నప్పుడు శీనుగాడి దగ్గర కొట్టెసి తిన్న జీడి కూడా బయటకు వచ్చేటట్లున్నాయి ఆ నీళ్ళు. నాకు అలవాటై పోయింది కాని..”

“సోది ఆపి అసలు విషయం చెప్పరా..”

“నీకు సోది లాగే ఉంటదిరా నా హైదరాబాదలు.”

“ఒప్పుకుంటానుగాని తర్వాత ఏమైంది చెప్పు.”

“…ఆవిదంగా నిద్ర లేచి ఫ్రెష్ గా ఉన్న నేను ఆ నీళ్ళతో స్నానం చేసి ఒంటికి మురికి పట్టించుకున్నాను. రూం కి తాళం వేసి పార్కింగ్ లోకి వచ్చాను. మొహానికి ఒకటి, తలకి ఒకటి కర్చిఫ్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేశాను. మా సందు తిరిగి మెయిన్ రొడ్ మీదకు ఎక్కుతుండగా..అక్కడంతా పొగ కమ్ముకొని ఉంది. కొంచం కష్టంగానే ఆ పొగలోగి వెళ్ళాను. అంతలో ఎవరో డబ్బాలో గులక రాళ్ళు వేసి కొడుతున్నట్లు శబ్దం వినిపించింది. మున్సిపాలిటి వాళ్ళు దోమలమందు కొడుతున్నారేమో అనుకున్నాను. కాని అది ఒక ఆటొ అని దాన్ని దాటి వెళ్తుంటే తెలిసింది. కొంచం ముందుకి వెళ్ళగానే ట్రాఫిక్ కిలోమీటరు దూరం ఆగి ఉంది. నేను బ్రేక్ వేశాను. నా వెనకాలే ఒక సిటి బస్సు గుద్ది నంత పని చేస్తూ ఆగింది. ఆ శబ్దానికి కోపంగా వెనక్కి తిరిగి చూశాను. దానికి సమాధానంగా బస్సు నన్ను గుద్ది ఆగింది. ఇక లాభంలేదనుకొని…”

“కొంపదీసి వాడితో గొడవ పడ్డావా ఏంటి.. నేను ముందే అనుకున్నాను.. నీ సొట్టపోయిన మొహం చూసి.. వాళ్ళే నిన్ను కొట్టారని..”

“..అంత సీన్ లేదురా. నేను అంత చాన్స్ ఇవ్వలేదు. ఆగి ఉన్న వెహికల్స్ మద్య నుండి సందుల్లో దూరుతూ అక్కడనుండి జారుకున్నాను. నా తెలివికి నాకే ఆనందం వేసింది. కాని నా ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఎదురుగా ట్రాఫిక్ పోలిస్ నుంచొని వున్నాడు. నన్ను ఆపాడు.

“లైసెన్స్ తీయ్.” “ఇన్స్యూరెన్స్ తీయ్.” “పొల్యూషన్ చెక్ తీయ్.” అని నా ప్రాణం తీశాడు.

అన్నీ చూపించాను.

“హెడ్ లైట్కి నల్ల రంగు లేదు. 500/- తీయ్.”

“అంత డబ్బులు నా దగ్గర లేవు సార్. ఉంటే హెడ్ లైట్కి నల్ల రంగు వేయించుకొనే వాడిని.” కొంచం అతితెలివి చూపించాను.

“నీకు రసీదు కావాలంటే 500/- వద్దనుకుంటే 100/-” అని ఒక ఆషాడం ఆఫర్ ఇచ్చాడు.

నాలొని భారతీయుడు ఒక్కసారిగా జూలు విదిలించాడు. బెల్ట్ మీద చెయ్యి వేశాను (కత్తి కోసం).

అప్పుడు గుర్తుకు వచ్చింది హడవిడిలో బెల్టు పెట్టుకోవడం మరచిపోయానని. ఐనా నాలో ఆవేశం చల్లారలేదు.

“నేను నీకు పావలా కూడా ఇవ్వను. ఏమి హీక్కుంటావో హీక్కో..”

ఇంకా ఎదో చెప్పబొతుంటే మద్యలోనే ఆపాను.

“ఓహొ పోలీసులు కొట్టారా నిన్ను..”

“వాళ్ళకి అంత సీన్ ఇస్తానా..”

“మరి తర్వాత ఏమి జరిగింది?”

“ఏముంది. నేను MMTS స్టేషన్ కి.. నా బండి పోలిస్ స్టేషన్ కి..”

“నువ్వెప్పుడూ అంతేరా..కానిస్టేబుల్ తో పోయేదాన్ని ఎస్.ఐ. దాకా తెచ్చుకుంటావు. తర్వాత ఏం జరిగింది. ”

“నాకు తోడుగా చాలా మందున్నారు స్టేషన్లో. ట్రైన్ వచ్చిన వేంటనే  ఆవేశంగా రన్నింగ్ లో ట్రైన్ ఎక్కాను. కొంతమంది నన్ను ముందుకు తొస్తే, కొంతమంది వెనక్కు తన్నారు. ఎలాగోలా లొపలికి ఎక్కాను. నా బాడి వచ్చింది కాని పర్సు పోయింది.”

“అయ్యో! డబ్బులు ఏమైనా ఉన్నాయా?”

“పెద్దగా లేవు గాని.. క్రెడిట్ కార్డు ఉంది. బ్లాక్ చేద్దామని కస్టమర్ కేర్ కి కాల్ చేశాను.”

“బ్లాక్ చేసారా?”

“ప్రస్తుతం మా సర్వర్ లన్నీ పడుకుని ఉన్నాయి. ఒకటిరెండు రోజులు ఆగి మీ అదృష్టాన్ని పరిక్షించుకొండి. అని పెట్టేశారు. దొంగ నా.. @#$@%!%@$^&^$^&^$&%@#%#&^$&^$&$%&”

(ఇక్కడ కొన్ని తిట్లు కూడా వాడటం జరిగింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటిని తొలగించటం జరిగింది. గమనించగలరు.)

“ట్రైన్ దిగిన తర్వాత కూడా నేను మాత్రం కాల్ చేయడం ఆపలేదు. వాళ్ళని కార్డ్ బ్లాక్ చెయ్యమని అడుగుతూనే ఉన్నాను. అలా రోడ్డు మీద మాట్లడుతూ వెళ్తున్న నాకు పడేదాకా తెలియలేదు… అక్కడ ఒక మ్యాన్ హొల్ ఉందని, అది మన మున్సిపాలిటి వారి సౌజన్యంతో తెరవబడి ఉందని.”

“వార్నీ..మ్యాన్ హొల్లొ పడ్డావా? మన హైదరాబాద్ లో మ్యాన్ హొల్లో పడి బ్రతికి బయటపడ్డవా? నిజంగా నువ్వు అదృష్టవంతుడివిరా. అసలు ఎలా బయటపడ్డావ్?”

“నన్ను ఫాలో అవుతూ వస్తున్న వొడాఫొన్ కుక్క(మాజీ హచ్ కుక్క) మ్యాన్ హొల్ చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. మొదట నాకు కంగారు వేసింది. తర్వాత భయం వెసింది. పెద్దగా అరవటం మొదలుపెట్టాను. కొంతసేపటికి బయటనుండి గోల గోలగా మాటలు వినిపించసాగాయి. నేను అరవడం ఆపి విన్నాను.”

“మనం అందరికంటే ముందుగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది స్వప్న. ఇక్కడ కుక్క ఒకటి మ్యాన్ హొల్ చుట్టూ తిరగడం చూసిన స్థానికులు 108 కంటే ముందుగా మనకే ఫోన్ చేసి పిలిచారు స్వప్న. ఇక్కడ మనం చూస్తున్నది.. ఒక వ్యక్తి మ్యన్ హొల్ లో పడి ఉన్నాడు. సహాయం కోసం బాదగా అరుస్తున్నాడు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు స్వప్న.”

నాకు అప్పటికి పూర్తిగా అర్దమయ్యింది. నా ప్రాణంతో మీడియా పండగ చేసుకుంటుందని.

“ప్రభుత్వం కోసం ఆగక పోతే నువ్వే నన్ను బయటకు లాగొచ్చు కదా?” ఇంకా పెద్దగా అరిచాను.

“సారి సార్.. చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోకూడదు.” అని బయటనుండి సమాదానం వచ్చింది.
అడిగిన ప్రశ్నకు సంబందం లేని సమాధానం వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా న్యూస్ చానల్ విలేకరేనని అర్ధమయ్యింది.
కొంతసేపటికి ఎవరో మున్సిపాలిటి వాళ్ళు లోపలికి దిగి నన్ను పైకి లాగారు. ఆ టైం లో వాళ్ళు దైవదూతల్లా కనిపించారు నాకు.

“ఆ తర్వాత ఎమి జరిగిందో నీకు నేను చెప్పనవసం లేదు.” అని ముగించాడు చందు వాడి హైదరాబాదలని.

“ప్రపంచంలో ఒక్క హైదరాబాదీకి తప్ప ఎవరికీ రావురా ఇన్ని కష్టాలు. ఒక్కరోజులోనే నువ్వు అన్నీ అనుభవించావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా..” అని వాడిని సముదాయించే ప్రయత్నం చేశాను.

వాడు ఎదో చెప్పేంతలో..

“ప్రపంచంలొ అన్ని కష్టాలు మీకే వచ్చాయనుకుంటున్నారా? ఈ మధ్య ఎక్కువగా మీకే ప్రమదాలు జరుగుతున్నయా? మీ అదృష్టం సరిగా లేదనుకుంటున్నారా? మీకు రావలసిన అవకాశాలు మీ శత్రువులకు అందుతున్నాయా?…”

నాచేతిలో టివి రిమోట్ లాక్కుని వాల్యుం పెంచాడు చందుగాడు.

టివిలో (ఈ మద్య సినిమాలు లేని హీరోయిన్) ఒకావిడ, చేతిలో ఒక ఉంగరం పట్టుకొని ఇంకా ఎదో చెప్తుంది. స్క్రీన్ మీద ఏవో ఫోన్ నంబర్లు స్క్రొల్ అవుతున్నాయి.

ఆ ఉంగరం మీద పడిన మెరుపు చందుగాడి కంట్లో మెరిసింది. వాడు మొబైల్ అందుకొన్నాడు.

(ఇక్కడ నుండి చందు రంగు రాళ్ళ కధ మొదలు అవుతుంది. రంగు పడుద్ది (రాళ్ళు కొంటే..) మీ కోసం త్వరలో మన ఇంద్ర లోకంలో)

రా.నా. స్టుడియోలో ఒక రోజు

నాకు సినిమాలంటే పిచ్చి.

పిచ్చి అంటే మాములు పిచ్చి కాదు.

హిట్ ఐన సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయని చూస్తే.. ఫ్లాప్ ఐన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయని చూస్తాను.

ఆ పిచ్చికొద్ది..అప్పుడప్పుడు స్టుడియోలకి వెళ్తుంటాను. ఈవిధంగా స్టుడియోలకి వెళ్ళడం వల్ల జ్ఞానం పెరుగుతుందని గీతలో గాడ్ కృష్ణ చెప్పాడు.

ఎప్పుడు చెప్పాడు అని గీత గీసి వెతికేరు. మీకు కనిపించదు.

ఇలా వెళ్ళడం వల్ల నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ కొసం….
1) మన “మూవీ మొగల్” రామానాయుడి గారి పేరు నుండి ‘రా’ ‘నా’ అక్షరాలను తీసి ఆయన మనవడికి (సురేష్ బాబు కొడుకు) “రాణా”
అని పేరు పెట్టారని ఇండస్ట్రీ టాక్.
2) మన టివీలో చూసే డాన్స్ కాంపిటెషన్స్, సింగింగ్ కాంపిటెషన్స్ కూడా సినిమా షూటింగ్ లాంటిదే. జడ్జెస్ మాత్రం ఒక గంట ఉండి వాళ్ళ షూటింగ్ చేసుకొని వెళ్ళిపొతారు. ఆ తర్వాత దాన్ని మిక్స్ చేసి మన మీదకు వదులుతారు. అది మనవాళ్ళకి తెలియక అంతా నిజమేమోనని ఒకటే ఏడుపులు పెడబొబ్బలు..

మా గురువు గారు ఒకాయన రా.నా స్టుడియోలో పని చేస్తున్నారు. అదేనండి.. మన రామానాయుడు స్టుడియోలో.

మూడు మార్నింగ్ షోలు ఆరు మాట్నీలు ఎనిమిది ఫస్ట్ షోలు పదహారు సెకండ్ షోలుగా నా జీవితం సాగిపోతున్న రొజుల్లో…

ఒక రోజు రా.నా.స్టుడియోకి నేను వెళ్ళబడ్డాను.

మెయిన్ గేటు దాటి లోపలికి వెళ్ళగానే నా చెవులకు సినిమా గాలి తగిలింది.

ఎదో సినిమా సాంగ్ తీస్తున్నట్లున్నారు. ఒకతను మెగాఫోన్ పట్టుకొని పెద్దగా నెంబర్లు అరుస్తున్నాడు. జూ.డాన్సర్స్ కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నారు.

అతన్ని నేను గుర్తుపట్టాను. ఒక డాన్స్ ప్రోగ్రాంలో మైకు ముక్కు దగ్గర పెట్టుకొని తెలుగుని తమిళ్ లో మాట్లాడుతుంటాడు.

నేను ఈ మధ్య రెండు మూడు సార్లు టివీలో ఆ ప్రొగ్రాం చూశాను.

నన్ను గుర్తుపడతాడేమోనని “నేను కాదు” అన్న బోర్డ్ మెహానికి తగిలించుకొని అక్కడ నుండి మెల్లగా జారుకున్నాను.

ఒక 20 అంతస్థుల బిల్డింగ్ సెట్టింగ్ వేసుంది అక్కడ.

మా గురువు గారు చెప్పారు..మన ‘ ఫైర్ స్టార్ – గిరి ‘ (పేరు మార్చడం జరిగింది) గారి సినిమా కోసం వేశారని. ఎదో ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నట్లున్నారు.

గొప్ప యాక్షన్ హీరోగా ఆయనకు పేరుంది. మాంచి ఫైటింగులు..చేజింగులు..జంపింగులు.. ఉన్న సినిమాలను జనాల్లో వదిలిన అనుభవం ఆయనది..

చిన్నప్పుడు.. అంటే నాకు ‘ఊహ ‘ తెలియనప్పుడు… నేను ఆయనకు భయంకరమైన విసనకర్రని (ఫ్యాన్ ని)… ( ఇవివి ‘ ఆమె ‘ సినిమాలో మొదటిసారిగా ‘ఊహ ‘ని చూసాను.)

ఫైటింగ్ అంటే నాకు భలే ఇష్టం. ఆయన ఫైట్ సిల్వర్ స్క్రీన్ మీద చూడటం తప్ప లైవ్ లో చూడలేదు.

అదృష్టం గజ్జి పట్టినట్లు పట్టడం వల్ల ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. 

ఆ సెట్టింగ్ ముందు ఎత్తుగా పరుపులు పేరుస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఇదేదో జంపింగ్ సీన్ అని నా సినిమా బుర్రకి గోకింది.

నాకు వచ్చిన ఈ అవకాశాన్ని వదల దల్చుకోలేక అక్కడ అన్నింటికంటే ఎత్తుగా ఉన్న గోడ మీదకి ఎక్కాను.

అక్కడనుండి అంతా బాగా కనిపించడంతో నన్ను నేను భుజం తట్టుకున్నాను.

ఫైట్ మాస్టర్ మైక్ పట్టుకొని ఎదో అరుస్తున్నాడు. మన హీరో 20వ అంతస్తు పిట్ట గోడ మీద నుంచొని రెడీగా ఉన్నాడు దూకటానికి.

నేను అలెర్ట్ అయ్యాను.

“యాక్షన్”

నేను దూకేశాను.

దూకినట్లు మూమెంట్ ఇచ్చిన మన హీరోగారు మాత్రం “కట్” అనడంతో కిందకి దిగి వచ్చారు.

లారీ టైర్ కింద పడిన కప్పలాగా ఉంది నా పరిస్థితి. మెల్లగా లేచాను.

“యాక్షన్” అని వినిపించింది.

నాకు ఇక ఓపిక లేదు.

ఈసారి మాత్రం మన హీరోగారు దూకేశారు. ఒక చిన్న స్టూల్ మీద నుండి పరుపు మీదకి…

సెట్ అంతా చప్పట్లతో మారుమోగింది. పదిమంది వచ్చి ఆయన్ను తీసుకొని వెళ్ళారు.

“ఈమాత్రం దానికి ఇంత పెద్ద సెట్ వెయ్యాలా? బాబుఖాన్ బిల్డింగ్ దగ్గర తీస్తే పోలా?” బయటకే కక్కాను.

“ఇది భారీ బడ్జెట్ సినిమా” అని మా గురువు గారు సెలవిచ్చారు.

మొదట భాధేసింది. తర్వాత నా మీద నాకే జాలేసింది.

అంతలో దూరంగా ఎదో సందడి కనిపిస్తే కాళ్ళను అటువైపు నడిపించాను. ఆ హడావిడి ప్రెస్ మీట్ కోసమని తెలిసింది.

ముంబాయి నుండి దిగుమతి చేసుకోబడిన హీరొయిన్ “గిల్లిపోనా” (అలవాటు ప్రకారం పేరు మార్చడం జరిగింది) ఎవరితోనో సెల్ ఫోన్ లో మెలికలు పోతుంది. ఆమె ముందు టెబుల్ మీద “హింది-తెలుగు-హింది” డిక్ష్టనరీ ఉంది.

ఒకతని మీద చాలా మంది వాలి ఎదో చెప్తున్నారు. అతను చేతులు గాల్లో దెన్నో రుబ్బుతున్నాయి.
మా గురువు గారు చెప్పారు.. ఆయన గొప్ప దర్శకుడని..ఆయన చుట్టూ మూగిన వాళ్ళు కధారచయితలని.. ప్రస్తుతం ఆయన కొత్త కధని రుబ్బుతున్నాడని…

ఒకాయన దెన్నో పోగొట్టుకున్నట్లు తిరుగుతున్నాడు. ఈయన నాకు తెలుసు. గొప్ప లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఈయన ప్రొడక్షన్ లో వచ్చాయి.
“మొదటి షెడ్యూల్ లో పోయిన డబ్బులు నువ్వు తిరిగి ఇస్తావా?” అని నన్ను నిలదీయడంతో అక్కడి నుండి పారిపొయిన నేను ప్రెస్ మీట్ మొదలయ్యే టైంకి వచ్చాను.

‘పసి హృదయాలు – మంచి కసి మీద ఉన్నాయి ‘ అనే బ్యానర్ కట్టి వుంది.

ముందుగా దర్శకుడు మైకందుకున్నాడు.
“ఇది ఒక డిఫెరెంట్ సినిమా. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, వాళ్ళింట్లో పనమ్మాయి మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరి. పనమ్మాయిగా మన రెష్మ ప్రదర్శన నటన సినిమాకే హైలెట్. కధ పాతదే ఐనా కధనం కొత్తగా ఉంటుంది. యాక్షన్ లవ్ సెంటిమెంట్ అన్నీ ఉన్న ఫ్యామిలి ఎంటర్ టైనర్. తప్పకుండా ఒక ఫీల్ గుడ్ సినిమాగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయటం ఖాయం. మన నిర్మాత గారు ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా…” అని ఇంకా ఎదో చెప్తున్నాడు.

నేను ఆ నిర్మాత వైపు చూశాను. సగం కాలిన బీడీని కాలితో తొక్కి ఆర్పినట్లు ఉంది అతని మొహం.

ఇక ఇప్పుడు మన గిల్లిపోనా వంతు.
తెందీ (తెలుగు + హింది) రానివారు సబ్ టైటిల్స్ చూడండి.
   “అండర్ కో ణమస్క రాం” అని తన పళ్ళు చూపించింది.
    (అందరికీ నమస్కారం)
  “ఈదో నేకి మడత సిన్మా”
    (ఇది నాకు మొదటి సినిమా.)
నా కధలో బూతులు రాయడం ఇష్టంలేక ఇక నుండి సబ్ టైటిల్స్ మాత్రమే రాస్తున్నాను.
“ఈ సిన్మాలో నాది ఒక బబ్లీ గర్ల్ క్యారెక్టర్. అందరినీ సరదాగా ఎడిపిస్తూ తిరుగుతూంటాను. నాకు అందరూ ఇక్కడ నచ్చారు. ఐ లవ్ హైదరాబాద్ బిర్యాని.” మళ్ళీ పళ్ళు చూపించింది.

ఇక నేను అక్కడ వుండలేక పోయాను.
మా గురువుగారిని సెలవు అడుగుదామని..
  “వళ్ళో వంగుతోము.”
     (వెళ్ళి వస్తాను)
అన్నాను తెందీలో.

****

చాలా రోజుల తర్వాత …

ఒక రోజు…

న్యూస్ పేపర్ చూస్తున్న నాకు “ఫ్యామిలీతో టాంక్ బండ్ దగ్గర తిరుగుతున్న ఒక నిర్మాతని ఆత్మహత్య చెసుకోబోతున్నాడేమోనన్న అనుమానంతో లేక్ పోలిస్ అరెస్ట్ చేశారు.” అన్న వార్త కనిపించింది.

ఆ వార్త కిందనే ఒక సినిమా పొస్టర్ వుంది.

మన ‘ఫైర్ స్టార్ ‘ గిరి ఈఫిల్ టవర్ మీదనుండి దూకుతున్నాడు.  

సినిమా టైటిల్ : ‘ఖడ్గమృగం – వీడు మనిషి కాడు ‘.

(అయిపోయింది.)

బ్రహ్మి – సాప్ట్ వేర్ ఇంజనీర్

హైదరాబాద్ లో ఐటి అద్వానస్థితిలో ఉన్న రోజులవి.

ఒక సోమవారం. తెల్లవారింది.

బరువుగాఉన్న కళ్ళను బలవంతంగా తెరిచాను.

వీక్ ఎండ్ పార్టీ వల్ల అనుకొనేరు.అంత సీన్ లేదు. రాత్రంతా ఒకటే పీడ కలలు..

నాకు జాబ్ పొయినట్లు.. ఎవ్వరూ నాకు పని ఇవ్వనట్లు.. హై-టెక్ సిగ్నల్ దగ్గర…

అయ్యబాబోయ్ తలచుకుంటేనే నిద్ర పట్టట్లేదు.

నా పేరు బ్రహ్మానందం. ఫ్రెండ్స్ నన్ను “బ్రహ్మి” అని పిలుస్తారు.

నేను హైటెక్ సిటీలో ఒక MNC కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను.

టైం చూశాను.

7.30 అయ్యింది.

 అది అక్కడే ఆగి పోతే బాగుండుననిపించింది.

గబగబా బ్రెష్ చేసుకొని, స్నానం చేసి రెడీ అవ్వసాగాను.

ఈ మధ్య వర్క్ అవర్స్ 12 అవర్స్ కి పెంచినప్పటినుండి ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు పని చెయాల్సి వస్తుంది. తలుచుకుంటెనే ఏడుపొచ్చింది.

అంతలో మొబైల్ లో మిస్సుడ్ కాల్ వచ్చింది. నేను గబగబా రూం లాక్ చేసి కిందకి దిగాను.

అది క్యాబ్ డ్రైవర్ నుండి అనుకుంటే మీరు తప్పులో తా(కా)లు వేసినట్లే.. కంపెనీ క్యాబ్ పంపించడం ఎప్పుడో మానేసింది.

అది పండుగాడి దగ్గరనుండి. “నేను బస్టాప్ లో వున్నాను. త్వరగా వచ్చేయ్” అని సిగ్నల్.

పిచ్చి కుక్క తరుముతున్నట్లు పరిగెత్తాను బస్సు మిస్ అవుతుందేమోనని….

దూరం నుండి చూస్తే అది బస్టాప్ లాగా లేదు. ఒక సంతలాగా ఉంది.

జాగ్రత్తగా గమనిస్తే అంతా మన “సామజిక వర్గం”కి చెందినవారే.. ఐటి ఉద్యొగులు..

అలవాటు ప్రకారం బస్సు.. బస్టాప్ లో కాకుండా దూరంగా ఆపాడు డ్రైవర్.

వాడికి K T (KnowledgeTransfer) ఇచ్చిన (డ్రైవింగ్ నేర్పిన) వాడిని అందరూ తిట్టుకుంటూ..బస్సులోకి తమ తమ శరీరాలని కుక్కుకొసాగారు.

ఎలగోలా నేను ఒక కాలు పెట్టుకోవడాని ప్లేస్ సంపాదించాను.

రేష్మ సినిమాకి (పేరు మార్చడం జరిగింది) ఫస్ట్ డే ఫస్ట్ షోకి ముందు సీట్ టిక్కెట్టు దొరికినంత సంతోషం వేసింది.

“మాస్టారూ.. నా చెయ్యి కనిపించడంలేదు. మీరు కాని చూసారా?” అని వినిపించడంతో కంగారుపడ్డాను.

నా రెండో కాలు కనిపించడంతో “హమ్మయ్య” అనుకొన్నాను. పండుగాడి పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

షాక్ కొట్టి తీగకు వేలాడుతున్న కాకిలాగా కడ్డీని పట్టుకొని వేళ్ళాడుతున్నాడు. దీనంగా చూశాడు.

నాకు అప్పటికప్పుడు “ప్రత్యేక బస్సు” ఉద్యమం చెయ్యాలనిపించింది.

ఆఫీస్ లో నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ గుర్తుకు వచ్చి ఆ ప్రయత్నాన్ని అప్పటికి విరమించుకున్నాను.

హైటెక్ బస్టాప్ వచ్చింది. అలవాటు ప్రకారం బస్సు కొండాపూర్ లో ఆగింది.
జనాలు నా ప్రమేయం లేకుండానే నన్ను బయటకు తీసుకు వచ్చి పడేసారు.

మట్టి హుండి పగలకొట్టి తీసిన పాత పదిరూపాయల నోటులాగా తయారయ్యాను. పండుగాడి కోసం చూశాను.

పండిన మామిడికాయని గట్టిగా పిసికితే బయటపడ్డ టెంకలాగా “జర్ర్”న  బయటపడ్డాడు. మమ్మల్ని విసిరేసిన బస్సు అక్కడినుండి “తుర్ర్”మంది.

షేరింగ్ ఆటొలు చుట్టూ మూగాయి.

“ఐటి పార్కుకి ఎంత?” అని అడిగాను.

“పది రూపాయలు” అన్నాడు. అప్పటికే మన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఆటోలో కుక్కుకొని ఉన్నారు.

“కిలో మీటరు దూరానికి పది రూపాయలా?”

“ఎప్పుడైనా ఆటో ఎక్కిన మొహమేనా?” అన్నట్లు చూసి “రయ్య్” మని నా మొహం మీద పొగకొట్టుకుంటూ వెళ్ళిపోయాడు.

ఎక్క్కడో కాలుతున్న వాసనొస్తుంటే పక్కకి చూశాను. పండుగాడు నా వైపు కోపంగా చూస్తున్నాడు.

వాడి పై జేబులో నుండి పది రూపాయలు తీసి కింద జేబులో వేసి కాళ్ళకి పని చెప్పాను. వాడు నా తోకయ్యాడు.

“ముష్టి మురికి అష్ట కుష్టి నికృష్ట అంక చండాల దరిద్ర…” అని పండుగాడు తిట్టుకొనే తిట్లు నాకు అస్సలు వినిపించలేదు.

అక్కడ రోడ్డ్ మీద చాలా మంది ఎదో పొగొట్టుకొన్న వాళ్ళలా వెతుకుతున్నారు. పాపం జాబ్ కోసమనుకుంటాను.

****

ఆయాసంతో వచ్చి నా డెస్క్ దగ్గర కూర్చొని గటగటా బాటిల్ నీళ్ళు తాగేశాను.

అప్పుడు గమనించాను. అక్కడ అందరి మొహాలు మా కెఫ్టేరియాలో పెట్టే చపాతీలలాగా ఉన్నాయి.

ఎవ్వరూ ఎమీ మాట్లాడుకోవడంలేదు. విషయమేంటని రమేష్ గాడిని గిల్లాను.

వాడు గాలిలో ఎవో సైగలు చేశాడు. భూమిని సూర్యుడు గుద్దుకోబొతున్నడని అర్దమయ్యింది వాడి సైగలని బట్టి.

“నీకు ఎలా తెలిసింది?” నేనూ సైగ చేశాను. వాడు మెయిల్ బాక్స్ చూపించాడు.

నేను నా మెయిల్ బాక్స్ ఒపెన్ చేశాను. నేను నా మెయిల్ బాక్స్ ఒపెన్ చేసినట్లు మాత్రమే గుర్తుంది.

రమేష్ గాడు నీళ్ళు కొట్టి లేపటంతో లేచాను.

అది “నో హైక్స్..నో బొనస్..మీ ఖర్మ.. చావండి.” అన్న మెయిల్ చూసి తిన్న షాక్ అని గుర్తుకు వచ్చింది.

మెయిల్ చదివినంత సేపూ రమేష్ గాడు నీళ్ళ బాటిల్ పట్టుకొని నా పక్కనే ఉన్నాడు.

అంత భాధలోనూ చెయ్యాల్సిన పని గుర్తుకు వచ్చి ప్రాజెక్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఎంత సేపు పని చేశానో గుర్తు లేదు.

 టైం 5.30 అయ్యింది.

మొబైల్ రింగ్ అయ్యింది. “నాన్న….లిప్ట్ చేయాలా వద్దా?” అనుకుంటూనే లిప్ట్ చేశాను.

“ఒరే బ్రహ్మం..మీ అమ్మ నీ పెళ్ళి అవుతుందో లేదోనని మంచం పట్టింది రా..సాప్ట్ వేర్ వాళ్ళకి పిల్లనివ్వడం లేదని మన పేరయ్య చెప్పాడు.”

ఫోన్ టాంక్ బండ్ లో విసిరెయ్యాలన్నంత కోపం వచ్చింది. అప్పటికి ఎదో చెప్పి ఫోన్ పెట్టేశాను. కాని అది నా ఒక్కడి సమస్య కాదని తెలుసు.

మొన్నటికి మొన్న మా ఊరులో నడిచివెళ్తూ ఉంటే “బాబూ.. నీకు కూడా ఉద్యోగం ఊడిందా? ఇల్లు కూడా అమ్మేశావా?” అని అడిగాడు ఒకడు పళ్ళు కుట్టుకుంటూ…
ఎదో 30నిమిషాల టివి ప్రోగ్రంలో చూశాడంట.. ఉద్యొగాలు పొగొట్టుకున్న సాప్ట్ వేర్ వాళ్ళ ముప్పై వేల ఇళ్ళు అమ్మకానికి ఉన్నాయని.
తెలుసిన ఊరిలో మర్డర్ చెయ్యటం ఇష్టం లేక వాడిని వదిలేశాను.
 
మళ్ళీ పని మొదలు పెట్టాను. పండుగాడు నా దగ్గరకు వచ్చి టైం అయ్యింది అని చెప్పేంత వరకు నేను టైం చూసుకోలేదు.

9.15 అయ్యింది.

గబగబా కంప్యూటర్ లాక్ చేసి బయలుదేరాను.

మరికొన్ని దరిద్రపు సంఘటనల తర్వాత నేను ఇంట్లో వచ్చి పడ్డాను.

బయటనుండి తెచ్చుకున్న ఫుడ్ పార్సిల్ కొంచం గతికి..బెడ్ మీదకి దూకాను.

బాగా అలసి వుండటం వల్ల త్వరగా నిద్రపట్టింది.

**********
అది 2010వ సంవత్సరం.

ఒక సోమవారం. తెల్లారింది.

బరువుగా ఉన్న కళ్ళను బలవంతంగా తెరిచాను.

వీక్ ఎండ్ పార్టీ లో లేట్ అవ్వడం వల్ల కళ్ళు ఇంకా నిద్రకావాలంటున్నాయ్.

టైం చూశాను.

9.00 అయ్యింది.

బద్దకంగా లేచి రెడీ అవ్వసాగాను. వీక్ ఎండ్ కొన్న లివిస్ షర్ట్, స్పైకర్ జీన్స్ వేసుకొన్నాను. 

మొబైల్ మీద మిస్సుడ్ కాల్ వచ్చింది. అది క్యాబ్ డ్రైవర్ నుండి అని తెలుసు కాబట్టి లైట్ తీసుకున్నాను.

ఒక అర గంట తర్వాత మెల్లగా క్యాబ్ లోకి ఎక్కాను.

నా మెయిల్ బాక్స్ లో నిండిన ‘తెలుగు మ్యార్టిమోని.కాం’ నుండి వచ్చిన అమ్మాయిలను తలుచుకొంటుంటే, క్యాబ్ హైటెక్ సిటీ వైపు పరిగెత్తింది.

brahmanandam

(ఇప్పుడే మొదలైంది.)

“రెసిషన్ కుక్క కరిసి, కష్టాలతో కాపురం చేస్తున్న నా సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు ఈ నా కధ అంకితం.”

గెంతు రాజా గెంతు !

పది అయ్యింది.
రాత్రి పది అయ్యింది.
ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది అయ్యింది.
ఇంట్లొకి వచ్చి షూ విప్పాను.
బెల్ట్ తీసాను.
అమ్మ, సుప్రజ నా వైపు భయంగా చూశారు.
బెల్ట్ చూసి భయపడ్డారేమోనని బెల్ట్ దాచేసాను.

ఇంకా అలానే చూస్తున్నారు. అప్పుడు గమనించాను.
టివిలో ఏదో ప్రొగ్రాం వస్తుంది. ఎవడో మూతి దగ్గర పెట్టుకోవలసిన మైక్ ని ముక్కు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు.

“అంతా బాగుంది కాని, నువ్వు కాళ్ళతో వెసిన స్టెప్స్ అన్నీ చేత్తొ వేస్తే ఇంకా బాగుండేది.”
“లేదు మాస్టర్, నేను వెయ్యలేను. ఎందుకంటే.. ఎందుకంటే.. నా చిటికిన వేలి గోరు విరిగింది.” అని ఏడ్చింది స్టేజ్ మీద కుక్కకి తిక్క తగిలితే చించిన గుడ్డలతో కుట్టిన గౌను వెసుకున్న చిన్నది. (గమనిక: చిన్నది – చినిగి పోయిన చిన్న డ్రెస్ వేసుకున్నది.)

(ఆలొచిస్తే గుర్తుకు వచ్చింది ఏదో ‘ఫోన్ కొట్టు..నన్ను పట్టు..’ ప్రొగ్రాంలో చూశాను ఈ పిల్లని. అక్కడ ఎవరో కొడితే ఇక్కడ పడినట్లుంది.)

స్లో మోషన్ లో ప్రేక్షకుల మొహాలు ఒకసారి చూపించారు.
కొందరు ఏడుస్తున్నట్లున్నారు.

“బంక మాస్టార్  మన శిల్పకి ఎన్ని మార్కులు ఇచ్చారో తెలుసుకునేముందు మన గెంతు రాజా గెంతు లో ఒక చిన్న (30నిమిషాలు) బ్రేక్ ” అని తన చేతులు గాలిలొ లేపి ఊపి కెమేరాని గుద్దింది.

ఆ గుద్దుకి నేను ఈ లోకంలోకి వచ్చిపడ్డాను.
ఇప్పుడు తెలిసింది వాళ్ళ ఎక్స్ ప్రెషన్ కి గల కారణం. అది భయం కాదు. ఆందోళన.
(డైలీ సీరియల్స్ చూసి చూసి ఎప్పుడు ఏ ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో మర్చిపోయారు.)

హడావిడిగా వంట గదిలోకి వెళ్ళారు నాకు డిన్నర్ రెడీ చెయ్యడానికి.
సొఫాలో కూర్చుంటూ టివి రిమోట్ అందుకుని చానల్స్ మార్చసాగాను.

ఒక న్యూస్ చానల్
“పంది ఇంకా లింగం చుట్టూ తిరుగుతునే వుంది. మరిన్ని వివరాలకు అక్కడే కుక్కలాగా కాచుకుని వున్న రామక్రిష్ట్నని అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు రామక్రిష్ట్న.”

ఇంకో చానల్
“నువ్వు ఎంచుకొన్న రాగం ఏంటి…నువ్వు పాడుతున్న తాళం ఏంటి..” ఎవడో బోడి గుండు వెదవ 3ఏళ్ళ పాపని బెదిరిస్తున్నాడు.

ఇంకో చానల్
“మీ టివి వాల్యుం కొంచం తగ్గిచండి.”

ఒక చానల్లో
ఒక కుటుంబం మొత్తం దేనిగురించో మాట్లాడుకుంటుంది. జాగ్రత్తగా గమనించాను. అందులో ముత్తాత, తాత, తండ్రి, కొడుకు, మనవుడు ఒకేలాగ ఉన్నారు.
ఒకేలాగా ఎంటి.. ఒక్కడే… మన ‘కమలాకర్ ‘ (పేరు మార్చడం జరిగింది). ఏదో చానల్లో కొడితే ఈ చానల్లో పడ్డాడు.

మరో చానల్లో
“కావ్య ప్రదీప్ ని కలుసుకుంటుందా? సుశాంత్ మొబైల్ బిల్లు ఎంతవచ్చింది? తులసమ్మ ఏమి పీకుతుంది? అని తెలుసుకోవాలంటే ‘ దిక్కుమాలిన బ్రతుకులు ‘ చూడండి”

ఇంకో చానల్లో
“…ఇదంతా తెలియని రామయ్య యదావిదిగా ఇంటికి వచ్చాడు. ఇంటిముందున్న కుక్కని కాలుతొ తన్నాడు. అప్పటివరకు నిద్రపోతున్నట్లు నటిస్తున్న కుక్క అతని పిక్క పట్టుకొంది.”
 స్క్రీన్ మీద ‘ కల్పిత పాత్రలతో’ (కుక్కతో సహా) అని వుంది.

ఇంకో చానల్లో
“…దానమ్మకి కోపం వచ్చింది. ఇప్పటివరకు దాన్ని నేను ఎప్పుడూ అలా చూడలేదు. నీ ఎంకమ్మ, అనవసరంగా దాని పిల్లను తెచ్చావ్.”
డైనోసార్ జీప్ ని పడేసి తొక్కుతుంది. ‘జురాసిక్ పార్క్’ తెలుగులో వస్తుంది అనుకుంటా…

మరో చానల్ మార్చాను.
“ఇక్బాల్ కి స్వైన్ ఫ్లూ వస్తుందంట.”
స్క్రీన్ మీద అడవి పందులు దేన్నొ పీక్కు తింటున్నాయ్. ‘ నెషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ‘.
నేను షాక్ తిన్నాను. ఇంగ్లిష్ ఛానల్లో తెలుగు మాటలేంటానని మ్యూట్ లొ పెట్టాను.

అప్పుడు తెలిసింది ఆ మాటలు వంట గదిలోనుండి వస్తున్నాయని.

ఆసక్తిగా విన్నాను.
” …స్వైన్ ఫ్లూ నా? ఎలా వచ్చింది? ఇక్బాల్ అమెరికా వెళ్ళలేదే?”
“వెన్నెలని ఎయిర్ పొర్ట్ లో డ్రాప్ చెయ్యడానికి వెళ్ళినప్పుడు అటాక్ అవుతొందంట.”
“అబ్బ పాపం ఇక్బాల్ కి అన్ని కష్టాలు వెన్నెల వల్లనే.”

నేను అటెన్షన్లోకి వచ్చెసాను.

“ఇందాక అనసూయ ఆంటి సన్ టివీలొ తమిళ్లో చూసిదంట.”
ఇప్పుడు నాకు పూర్తిగా అర్దమయ్యింది వాళ్ళు దేని గురించి మాట్లడుకుంటున్నారో…”మొగలి రేకులు పిచ్చి ఆకులు” అనే సీరియల్ గురించి…
నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు మొదలైనట్లు  గుర్తు.

“ఐనా అనసూయ ఆంటీకి తమిళ్ ఎలా వచ్చింది? వాళ్ళు ఎప్పుడైనా చెన్నైలో ఉన్నారా? స్కూల్ తమిళ్ మీడియంలో చదివిందా? మీ ప్రశ్నకు సమాధానం ‘ అవును ‘ ఐతే …..”
“అయ్య బాబోయ్.. కొంచం సేపు టివి చూస్తేనే ఇలా  ఆలోచిస్తున్నానేంటి..”

అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు ఒక భయంకరమైన నిజం.

వాళ్ళు కొన్ని రోజులు ‘ చెన్నై షాపింగ్ మాల్ ‘ పక్క వీదిలో ఉన్నారు.

నా డిన్నర్ రెడీ అయ్యింది.
వాళ్ళెందుకో కొంచం హడవిడిగా కనిపించారు. దేని కోసమో వెతుకుతున్నట్లున్నారు.
సుప్రజ కళ్ళు నా చేతిలొ ఉన్న రిమోట్ మీద పడ్డాయి. మొహంలో ఆందొళన కనిపించిది.
(ఆ ఎక్స్ ప్రెషన్ కి అర్ధం ఆనందం అని తర్వాత తెలిసింది.)

నేను రిమోట్ ఇచ్చేసాను.

“వెల్కం బ్యాక్ టూ గెంతు రాజా గెంతు.” టివిలో ప్రొగ్రాం మొదలైంది.

నేను డిన్నర్ చేస్తున్నంత సేపూ ఏవో అరుపులు, కేకలు, ఏడుపులు వినిపించాయి. అప్పుడప్పుడు కొన్ని ‘బీప్’లు కూడా వినిపించాయి.

డిన్నర్ ఫినిష్ చేసి వాళ్ళ వేపు చూసాను. వాళ్ళ మొహాల్లో ఆనందం కనిపించింది.
(ఆ ఎక్స్ ప్రెషన్ కి అర్ధం ఆందోళన అని అప్పుడే అర్ధమయ్యింది.)

నేను నా ‘లాప్ టాప్’ ఆన్ చేసి ఈ కధ వ్రాయడం మొదలు పెట్టాను.

(అయిపోయింది.)

“చెత్త చెత్త సీరియల్స్ తో, పరమ చెత్త ప్రొగ్రాములతో, బ్రేకింగ్ బేకింగ్ న్యూస్ లతో ప్రేక్షకులని హింసిస్తున్న టివి చానల్స్ కి నా ఈ కధ అంకితం.”

Previous Older Entries