శీనుగాడి బాబాయ్

ప్రతి సంవత్సరం వేసవి సెలవలకి మా అమ్మమ్మవాళ్ళ ఊరికి వెళ్ళడం అలవాటు. ఈ సారి మాత్రం ఎక్కువ రోజులుండటం కుదరదు మరి.

పదోతరగతి ఐన వెంటనే ఇంటర్ సిలబస్ మొదలు పెట్టేస్తారు. ఇంటర్ తో పాటుగా EAMCET కోచింగ్ ఒకటి. రెండు సంవత్సరాలు ఊపిరిసలపనంత చదువుంది. ఎలాగోలా ఒక పదిరోజులు అమ్మమ్మవాళ్ళ ఊరిలో మకాం వేసేందుకు నాన్నను ఒప్పించా.

ఇంకో రెండు సంవత్సరాలకు సరిపడా ఈ పది రోజుల్లోనే గడిపేయాలని బస్సు ఎక్కుతోనే నిర్ణయించుకున్నాను. టౌను నుండి ఒక గంట ప్రయాణం అమ్మమ్మ వాళ్ళ ఊరు. బస్సు ఎక్కడంతోనే బస్టాండ్ లో కొన్న బాలమిత్ర చదవడం నాకు అలవాటు. మొదట్లో మా నాన్న వదిలి పెట్టి వచ్చేవారు. అప్పుడు నేను తప్పని సరిగా గొల్డ్ స్పాట్ తాగి బాలమిత్ర కొనిపించుకొనే వాడిని. ఊరు వచ్చే లోగా ముందు గబగబా మినీ నవల చదివి మిగతా కధలు పూర్తి చెసేవాడిని. ఒక్కొసారి కొన్ని కధలు చదవకుండా తర్వాతకి దాచుకునేవాడిని.

ఊళ్ళో బస్సు దిగటంతోనే ఎదురుగా ఉంటది కిట్టయ్య కొట్టు. పులిబొంగరం తింటే కిట్టయ్య కొట్లోనే తినాలని పక్క ఊళ్ళల్లో చెప్పుకుంటారు. కొట్టు కిట్టయ్య కొడుకు పూర్ణగాడు, నేను ఊళ్ళొనే కలసి చదువుకున్నాం. నేను ఐదవ తరగతి దాకా ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. ఇక్కడ చదువు సరిగ్గా సాగట్లేదని మా నాన్న టౌన్ లో చేర్పించి మకాం కూడా అక్కడికే మార్చాడు.

బస్సు దిగుతున్న నన్ను చూడగానే కొట్లో కూర్చున్న పూర్ణగాడి మొఖం వెలిగి పోయింది.

పక్కనే పులి బొంగరాలు వేస్తున్న వాళ్ళ నాన్నకి కనిపించకుండా సైగ చేశాడు. శీనుగాడిని, సూరిగాడిని తీసుకొని మన అడ్డా దగ్గరికి రమ్మని నేను కూడా సైగ చేసి ఇంటికి పరిగెత్తా. పులి బొంగరాలు తెమ్మని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వాడికి.

మిట్ట మధాహ్నం ఎండలో ఇంటి ముందు కందులు ఆరబోస్తూ కనిపించింది అమ్మమ్మ. మహాలక్ష్మమ్మ అంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో హడల్. తాత పొయి ఆరు సంవత్సరాలైనా గట్టిగా నిలబడి తానే పొలం పనులన్నీ చూసుకుంటుంది. గట్టు మీద నిలబడి అరిచిందంటే పది గొర్రుల పొలంలో పని చేసే కూలొళ్ళంతా పరిగెత్తాల్సిందే.  కల్లంలో గింజ పొల్లు పోనీయదు. కూలివ్వడంలో పావలా తేడా రానియ్యదు.

నన్ను చూస్తూనే చేసే పని వదిలేసి పరుగున వచ్చింది.

“మానాయనే! చిక్కి పోయావేందిరా. బక్కగా అయినావ్ మీ తాత లాగా..”

నేను పంచలో వాల్చిన మంచం మీద కూర్చుంటే, ఇత్తడి బుడ్డి చెంబులో నీళ్ళు తెచ్చి ఇచ్చింది అమ్మమ్మ.

“కొత్త కుండలో నీళ్ళు. బాగా సల్లగా ఉంటయ్. నువ్వొత్తావని మంచం సల్లు లాగిచ్చా ఎంకడిని పిలిచి.” అమ్మమ్మ చెబుతుంటే, ఊరందరినీ హడల్ కొట్టే మాలక్ష్మమ్మ నా మెప్పు పొందటానికి చేసే ప్రయత్నం కనిపించింది.

“మీ నాయనికి నేను చెప్పలేకపొతిని. ఏమి చదువులో పిల్లల్ని పిండక తింటన్నయ్. మీ తాత చదువుకున్నాడా ఎంది?”

నేను ఎమీ మాటాడక పొయేసరికి, మళ్ళీ తనే..

“అవున్లే, ఆ కాలం వేరు. బాగా చదుకొని ఆఫీసర్ ఉద్యోగం చెయ్యాల నా మనవడు.” మురుసుకుంటూ లోపలికి వెళ్ళింది.

“నీ కోసం ఆ వెంకట్రావ్ కొడుకు, కొట్టు కిట్టయ్య కొడుకు తెగ తిరిగి పోయార్రా.” లోపలనుండే చెప్పింది.

నేను కూడా వాళ్ళ కోసమే ఎదురుచూస్తున్నా. సూరిగాడిది పక్కిల్లే.. నాలుగిల్లవతల శీనుగాడిది..

ఇప్పుడే వెళ్తానంటే ఒప్పుకోదు. ఉన్న నాలుగురోజులైనా ఇంటిపట్టునుండాలంటది. కాని నేను ఇక్కడికి వచ్చిందే వీలైనంతవరకు వాళ్ళతో ఆడుకోవాలని కదా.

సజ్జ బూరెలు, కారప్పూస కొత్త స్టీలు ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చింది.

“మన తూర్పు చేలో పండినయ్ సజ్జలు. సుబ్బి పిండి కొట్టింది.” అమ్మమ్మ చెబుతున్నా నేను మాత్రం అక్కడ లేను.

ఒక బూరే కొంచం కొరికి, “అమ్మమ్మా, నేను శీనుగాడి దగ్గరికి వెళ్ళి వస్తా” అన్నా ఒప్పుకోదని తెలిసికూడా.

“వాళ్ళేడికి పోతార్రా. చల్ల జామున ఆడుకుందుర్లే. అన్నం తిని పరమటింట్లో పడుకో అందాకా.” అని నేను చెప్పేది వినిపించుకోకుండా నా బట్టల సంచి లోపలికి తీసుకెళ్ళింది.

“ఐతే ఇప్పుడే అన్నం పెట్టు” అని తొట్టి దగ్గర కాళ్ళు చేతులు కడిగి, పీట లాక్కొని కూర్చొన్నాను.

నన్ను కనిపెట్టి అమ్మమ్మ కూడా నవ్వుకుంది.

***************

నలుగురం ఏటిగట్టునున్న మామిడితోటకి పరిగెత్తాం, అమ్మమ్మ పిలుస్తున్నా వినకుండా.

ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాం, పూర్ణాగాడు పొట్లాం విప్పడమే ఆలస్యమన్నట్లు చూస్తూ. తలా రెండు పులి బొంగరాలు తిన్నాక, గట్టు మీద నుండి ఏట్లొకి దూకి ఈత కొట్టాం.

తొటలో రెండు పచ్చి మామిడి కాయలు కోసుకొని శీనువాళ్ళ కొట్టానికి వచ్చాం.పంచకమ్మిన దాచిన ఉప్పుకారం పొట్లాం తీసాడు శీనుగాడు. మా అందరికీ నొట్లో నీళ్ళూరాయ్. సూరిగాడు కాకి ఎంగిలి చేసి తలా ఒక ముక్క పెడుతుంటే, మేము ఉప్పుకారం లో ముంచుకొని తిన్నాం. దాగుడు మూతలు ఆడాలని ఎకగ్రీవంగా తీర్మానించాం. సూరిగాడు నెంబర్లు లెక్క పెడితే మేము దాక్కున్నాం.
నేను కొస్టాంలొ మూలన పెట్టిన వరి బోదెలో దిగి దాక్కున్నా. అడుగున వరిగడ్డీ పోసి మెత్తగా వుంది.

చాలసేపు ఆడి అలసిపోయుండటం వల్ల వెంటనే నిద్ర పట్టేసింది.

***************

కళ్ళు తెరిచిచూసే సరికి అంతా చీకటిగా వుంది. ఎంతసేపు నిద్ర పొయానో కూడా తెలీదు. బోదెలో నుండి దిగి కొస్టం బైటకి వచ్చా. పండు వెన్నెల్లో అంతా స్పష్టంగా కనిపిస్తుంది.

కాని నేను ఒక్కడినే ఉండేసరికి భయమేసింది. చుట్టూ చూసుకుంటూ, మెల్లగా ఇంటి వైపు నడవడం మొదలు పెట్టా.

మాములుగా ఐతే ఇల్లు అంత దూరమున్నట్లు అని పించేది కాదు. ఒక్క పరుగులో ఇంటికి చేరుకొనే వాళ్ళం.

మామిడి తోపు గట్టుగా వేసిన వెదురు చెట్లు గాలికి వూగుతూ శబ్దం చేస్తున్నాయ్. అవి ఎంత భయంకరంగా వున్నాయంటే చెట్లు కూడా భయపడి వద్దంటూ తలలు ఆడిస్తున్నాయ్.

వెంటనే మూల తిరిగే దగ్గరున్న చింతచెట్టు గుర్తుకు వచ్చి ఒక్కసారిగా నా కాళ్ళు నడవడం ఆపేసాయి. దానికి రాత్రిపూట దెయ్యాలు ఊగుతుంటాయని చెప్పుకుంటారు. సూరిగాడు కూడా ఒకసారి చూసాడంట.

చెమటలతో వళ్ళంతా తడిసి ముద్దయ్యింది. చల్లగాలికి వణుకు కూడా మొదలైంది. అలాగే మెల్లిగా నడవడం మొదలు పెట్టాను. చింత చెట్టు దగ్గరయ్యెకొద్దీ నాలో భయం తాలుకు ఆనవాళ్ళూ రెట్టింపయ్యాయి.

చీకట్లో మరీ భయంకరంగా వుంది.  ఇక లాభంలేదనుకొని, మనసులోనే “ఒకటి..రెండు..మూడు..” అని ఒక్క పరుగు అందుకొనేలొపలే,

నా భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్లయ్యింది. అంతే ఒక్కసారిగా పెద్దగా అరిచి కళ్ళు మూసుకున్నా.

“ఒరే, నేను శీనుగాడి బాబాయిని రా!”
కళ్ళు తెరిచి చూసా. “అవును”. కొంచెం నెమ్మదించా.
“ఇక్కడేం చేస్తున్నావురా, ఇంత చీకట్లో, ఇంటికి పోకుండా?” ఆడిగాడు శీనుగాడి బాబాయ్.
మొత్తం చెప్పా. భయం పోయేసరికి, వాళ్ళమీద కోపం వచ్చింది, నన్ను ఇలా ఒక్కడిని వదిలి వెళ్ళేసరికి.

“సరే, నాతోరా..” అని చెయ్యి పట్టుకొని లాగినట్లు తీసుకెళ్ళసాగాడు.
పక్కన ఆయన వున్నా చింత చెట్టు దగ్గరయ్యేసరికి నా నడక వేగం తగ్గింది. అది గమనించి,
“ఏరా, చింత చెట్టంటే భయమా? ఎందుకు..?”
నేను విన్నది చెప్పా. “నిజమేనా?” అన్నట్లు చూసా.

“దెయ్యాలు వేళ్ళాడమెంటి? వాళ్ళ పిచ్చి గాని. పద చూపిస్తా.” అని వద్దన్నా వినకుండా చెట్టు కిందకు లాక్కెళ్ళాడు.
“చూడు. ఏవి దెయ్యాలు?”
“అవును. నిజంగా దెయ్యాలు లేవు.” అన్నాను చుట్టూ చూస్తూ. కొంచెం ధైర్యం వచ్చింది నాకు.
పైకి తలెత్తి, చింత చెట్టును గమనించసాగాను. దూరంగా కనిపించినంత భయంకరంగా ఏమి లేదు ఆ చింత చెట్టు. కొమ్మలు బాగా బలంగా అందనంత ఎత్తులో వున్నాయ్.

ఇంకా భయం పొగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న నేను, “అసలు..అంతేత్తు కొమ్మకి దెయ్యం ఎలా వేళ్ళాడిద్ది?” అన్నా చిన్నగా నవ్వుతూ.

“ఇలా” అంటూ మాయమైన శీనుగాడి బాబాయ్ చెట్టు కొమ్మకు వేళ్ళాడుతూ కనిపించాడు.

ఒక్కసారిగా తలలో మొదలైన వణుకు వళ్ళంతా పాకింది. కాళ్ళ కింద భూమి పరిగెత్తింది. వెనక్కి తిరగకుండా పరిగెత్తుతూనే వున్నా, ఎంతసేపటికీ ఇల్లు రావడంలేదు.

అప్పుడప్పుడు, దారి పక్కన శీనుగాడి బాబాయ్ కనిపించి, “పడతావురొయ్.. చిన్నగా వెళ్ళు.” అని

మరో పక్క కనిపించి “చింత చెట్టుకి ఉయ్యాల ఊగుతావా?” అని అడుగుతున్నాడు.

పరిగెత్తుతున్న నాకు దూరంగా ఒక ఆకారం నావైపు రావడం చూసా. చెతిలో ఎదో వెలుగుతూ కూడా వుంది.
“వామ్మో, కొరివి దెయ్యం” అని కుప్పకూలిపోయా.

**************

కళ్ళు తెరిచేసరికి అమ్మమ్మ ఒళ్ళొ వున్నా, నుదిటి మీద తడి గుడ్డతో.
“రాత్రంతా ఒక్కటే కలవరింతల్రా. ఎవరి దిష్టి తగిలిందో ఏమో నా బిడ్డకు..” కళ్ళకు నీరొత్తుకుంది అమ్మమ్మ.
“లేచి మొహం కడుక్కో.. రెండు ఇడ్డెనలు తిందుగ్గాని.”
లేచి కూర్చున్నా. కాళ్ళు లాగేస్తున్నాయ్. తలంతా భారంగా అనిపించింది. రాత్రి జరిగినదంతా ఒక్కసారి కళ్ళముందు తిరిగింది.
లేని సత్తువ కూడగట్టుకొని, శీనుగాడింటికి పరిగెత్తా.
“ఒరే, నీకోసం వెతికి కనిపించక పొయేసరికి, మీ అమ్మమ్మకి చెప్పాం నిన్న సాయంత్రం.” అన్నాడు వాడు నన్ను చూస్తూనే.
“మీ బాబాయ్ ఎక్కడ?” సూటిగా అడిగా.
గోడ మీద వున్న పటం చూపించాడు శీనుగాడు. రెండు నెలల క్రితం ఎట్లో దూకి చనిపొయాడు శీనుగాడి బాబాయ్.
(అయిపొయింది.)

నేను దెయ్యాల్ని నమ్మను… అప్పటి వరకు

డిసెంబర్ 13 గురువారం.

రాత్రి 11:45

ఆఫీస్ నుండి కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యి బయలుదేరేసరికి లేట్ అయ్యింది ఆ రోజు. లాప్ టాప్ బాగ్ లొ పెట్టుకుంటూ ఇంటికి ఫోన్ చెసి చెప్పాను బయలు దేరుతున్నానని…
ఆ టైం లో ట్రాఫిక్ పెద్దగా లేక పోవడంతో ఏడు నిమిషాల్లొ హైటెక్ సిటి MMTS స్టేషన్ వరకు వచ్చేసాను.

ట్రైన్ ట్రాక్ కింద నుండి వెళ్ళే రోడ్ ఒక స్మశానం గుండా మెయిన్ రోడ్ లొ కలిస్తుంది. ఈ స్మశానం MMTS స్టేషన్ వెనక ఉంది. నాకు తెలిసినప్పటినుండి దీనికి ఎప్పుడూ ప్రహరీ గోడ లేదు.  అందువల్ల రొడ్డుకి దగ్గరలో శవాలని తగలబెట్టడం కనిపిస్తుంది అప్పుడప్పుడు.

11:52

“మరణమునే స్మరణముగా.. కదనములొ వేటాడే..
రళగళమే నిగళముగా.. ప్రాణముతో ఆటాడే…”

స్టీరియోలో ఆరవింద్ – 2 లో పాట హై వాల్యుం లో వస్తుంటే నా కార్ వేగంగా ట్రైన్ బ్రిడ్జ్ ని దాటింది. రోడ్డు మీద ఎవరూ లేరు అన్న ధైర్యంతో అనుకుంట నా కార్ ఎంత వేగం తో వెళ్తుందో కూడా నేను గమనించలేదు. కాని  యాక్సలిరేటర్ మీదున్న నా కాలికి మాత్రం తెలుసు..

కార్ హైభీం వెలుతురులో ఒక వ్యక్తి సైకిల్  మీద ఎదురుగా వస్తూ కనిపించాడు. నేను ఒక్కసారిగా బ్రేక్ నొక్కాను. అప్పటికే ఆలస్యం అయ్యింది. కార్ గుద్దుకున్నట్లు ఆగి పొయింది.

అంతా నిశ్శబ్దం…
నా గుండె చప్పుడు నాకే వేగంగా కొట్టుకొవడం వినిపించింది.

ఏమి చెయ్యలో తోచడం లేదు. కార్ దిగడనికి నా మనసు అంగీకరించడం లేదు.
కార్ బానెట్ మీదగా చూసా ఎమైనా కనిపిస్తుందేమోనని…

లో భీం లైట్స్ వేశా. అప్పుడు కార్ బంపర్ కింద ఉన్న సైకిల్ కొద్దిగా కనిపించింది.
నాలో భయం మొదలైంది.

నేను గుద్దిన వేగానికి ఖచ్చితంగా మనిషి బ్రతికే చాన్స్ లేదు. కొన ప్రాణంతో ఉంటే కనీసం మూలుగు వినిపిస్తుందేమోనని, మెల్లగా విండో గ్లాస్ కిందకి దించాను. అప్పటి వరకు అద్దం బయట కాచుక్కుచున్నట్లు చల్లగాలి ఒక్కసారిగా లోపలికి వచ్చి నన్ను తాకింది.

బయటకి చూసాను.
కార్ దిగి చూడటానికి ఒకటికి రెండు సార్లు ఆలొచించి, మెల్లగా డొర్ తీసుకొని కిందకి దిగాను.
అంతే… ఒక్కసారిగా ఎవరో స్మశానం లోకి పరిగెత్తినట్లనిపించింది. ఎవరా అది అని నేను అటువైపు చూసాను.

రోడ్డుకి ఆనుకునివున్న స్మశానం నిశ్శబ్దంగా వుంది. నక్కలు వుండే అవకాశం లేదు కనుక అరుపులు వినిపించడం లేదు. జీవితంలో అలసిపొయిన ఎన్నో జీవితాలు అక్కడ ప్రశాంతంగా నిద్ర పొతున్నాయి. కొత్తగా అక్కడ చేరిన వాళ్ళ సమాధులు చంద్రుని వెలుగులో తెల్లగా మెరుస్తున్నాయి. స్మశాన నిశ్శబ్దం అంటే ఎంటో అప్పుడు నాకు పూర్తిగా అర్దమయ్యింది.

కాని ఆ నిశ్శబ్దం లో నేను మత్రమే కాదు.. నాతో ఇంకా ఎవరో ఉన్నారన్న ఆలోచన అంగీకరించే పరిస్థితిలో నేను లేను.

అప్రయత్నంగా కార్ బంపర్ వైపు చూసిన నాకు అక్కడ సైకిల్ కనిపించలేదు. ఇంక నాకు తప్పలేదు పూర్తిగా భయానికి లొంగిపోక…

ఎంత వేగంగా కార్ లో కూర్చున్నానో అంతే వేగంగా డోర్ లాక్ చేసి, విండో గ్లాస్  పైకి లేపాను.
త్వరగా అక్కడినుండి వెళ్ళాలన్న నా ప్రయత్నాన్ని ఎవరో ఆపుతున్నట్లు… కార్ స్టార్ట్ కాలేదు.. నేను నా ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు.

అంతలో బ్యాక్ డోర్ ఒక్కసారి ఒపెన్ అయ్యి క్లొజ్ అయ్యింది… ఎవరో బ్యాక్ సీట్లో కూర్చున్నట్లు అనిపించింది. మరుక్షణం ఆశ్చర్యంగా కార్ స్టార్ట్ అయ్యింది.

**************

ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా కార్ వేగాన్ని అందుకుంది.
వెనక నుండి ఏవో మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. వెనక్కి తిరిగి చూడలేకపొయాను. స్టీరియో వాల్యుం పెంచాను. వెంటనే ఎవరో తగ్గించినట్లు వాల్యుం తగ్గిపొయింది. మళ్ళీ వాల్యుం పెంచే ధైర్యం నాకు లేక పోవడంతో వెనక నుండి వచ్చే సన్నని శబ్దాలను వినక తప్పలేదు.

తేదీ మారింది. సమయం 00:04
మైయిన్ రోడ్డెక్కి ఒక ఐదు నిమిషాలు ప్రయాణిచానో లేదో… ఒక ఫుటొవర్ బ్రిడ్జ్ దగ్గరకి వచ్చేసరికి.. కార్ పెద్ద శబ్దంతో ఆగి పొయింది…

ఇంక భయపడే ఓపిక నాకు లేదు. అంతే కాక ఒక రకమైన మొండి ధైర్యం కూడా వచ్చింది. వెనక్కి తిరిగి పెద్దగా అరుద్దామనిపించింది.
మళ్ళీ వెనక డోర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యింది… ఎవరో కిందకి దిగి పొయినట్లు..

నా ప్రమేయం లేకుండా జరుగుతున్న సంఘటనలను గమనించడం తప్ప ఏమీ చెయ్యలేకపొతున్నాను. ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే ఉన్నానేమో అన్న భావన నన్ను మరింత కృంగదీసింది. ఈసారి మొదటి ప్రయత్నం తోనే కార్ స్టార్ట్ అయ్యింది.

అక్కడి నుండి వీలైనంత త్వరగా వెళ్ళి పోవాలన్న తొందర నా కాలికి బుద్ది చెప్పడంతో యాక్సిలిరేటర్ మీద ఒత్తిడి పెరిగింది.

***************

మర్నాడు ఉదయం.
టైమెంత అయ్యిందో కాని నిద్రలేచేసరికి రోజు మీదబాగా ఆలస్యం అయ్యింది. రాత్రి జరిగిందంతా ఒక్కసారి గుర్తుకువస్తే అది కలైతే బాగుండునని పించింది. మా ఆవిడ నన్ను తరమడంతో ఆఫీస్ కి తయారవ్వడానికి బాత్రూం లోకి దూరాను.

ఒక ఇరవై నిమిషాల్లో ఆఫీస్ కి బయలుదేరాను.
కధ ఇంతటితో అయిపొతే బాగుండేది. కాని ఆ తర్వాత జరిగిన సంఘటనలు ముందు రోజు జరిగింది కల కాదు అనే విషయాన్ని పదే పదే గుర్తు చేశాయి.

మధ్యాహ్నం 12:02

నా కార్ స్మశానం మీదుగా వెళ్తుంది. నేను వద్దన్నాగాని నా కళ్ళు స్మశానం లో కి చూసాయి. అక్కడ….

నలభై ఐదు యాభై మధ్య ఉంటాయనుకుంటా వయస్సు… ఒక వ్యక్తి నిల్చొని నా వైపే చూస్తున్నాడు.
అతని పక్కనే ఒక సైకిల్ పడి వుంది. నేను వెంటనే నా చూపు పక్కకు తిప్పుకున్నాను.

కొంచెం ముందుకు వెళ్ళి సైడ్ మిర్రర్ లో చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.

(అయిపోయింది)

యుద్ధం – 1

సాయంత్రం 5:30

“నువ్వు నా ముందుంటే… నిన్నలా చూస్తుంటే..”

రేడియోలో పాట వస్తుంది.

హైవేకి పక్కనే ఉన్న దాబా కావడం వల్ల వచ్చే పొయే వెహికల్స్ తొ గోలగా ఉంది.

లోపల పెద్దగా జనం లేరు. కార్నర్ లో ఒక అమ్మాయి కూర్చొని వుంది.
ఎందుకో మాటిమాటికి బయటకి కంగారుగా చూస్తుంది. దేని గురించో భయపడుతున్నట్లు ఆమె మొహనికి పట్టినచెమట చెప్తుంది.

20..22 మధ్య ఉంటుంది ఆమె వయస్సు. ఆమె కోసమే కుట్టినట్లున్నాయి ఆమె వేసుకున్న లెమన్ యెల్లొ టాప్, స్కై బ్లు జీన్స్.

ఒక యమహా బైక్ ఆగింది దాబా ముందు. ఆమె కళ్ళు కంగారుగా బయటకి చూసాయి. వైట్ షర్ట్, బ్లు జీన్స్ వేసుకున్న యువకుడు లోపలికి వచ్చాడు. వస్తూనే దేని కొసమో వెతికాడు. ఆమె కూర్చున్న వైపు నడిచాడు. అతను దగ్గరికి వస్తున్నకొద్దీ ఆమెలో కంగారు ఎక్కువైంది.

పక్కనే ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ములో నీళ్ళు తీసుకొని బయటకి వెళ్ళిపోయాడు. వణుకుతున్న ఆమె శరీరం కొద్దిగా నెమ్మదించింది.

బయటకు చూసింది.
తన బైక్ ని తిట్టుకొంటూ చేతులకి ఐన ఆయిల్ ని కడుక్కోసాగాడు.
మంచి హైట్ ఉన్నాడు. కొంచం అటూ ఇటుగా ఆరు ఉండొచ్చు. బాగా కలర్ కాకపొయినా.. ఫెయిర్ గా ఉన్నాడు. షర్ట్ హాఫ్ ఫొల్డ్ లో నుండి చేతులు బలంగా కనిపిస్తున్నాయి.
లోపలికి వచ్చి ఆమెకి రెండు కుర్చీల పక్కగా కూర్చున్నాడు.

ఆమె అప్పటివరకు చదువుతున్న పేపర్ లోకి మళ్ళీ తలదూర్చింది.

“టీ.. కాఫి.. బూస్ట్.. హార్లెక్స్.. బొర్నవిటా.. ఎమి కావాలి సార్?” గుక్క తిప్పుకోకుండా అడిగాడు దాబా కుర్రాడు.
“టీ” ముక్తసరిగా సమాధానమిచ్చాడు.
“సార్ కి ఒక స్ట్రాంగ్ టీ..” అని అరిచి “నిన్నా కుట్టేసినాది.. మొన్నాకుట్టెసినాది..” పాడుకుంటూ లోపలికి వెళ్ళాడు వాడు.
చిన్నగా నవ్వుకొని పరిసరాలను గమనించసాగాడు.

అంతలో ఒక జీప్ వేగంగా వచ్చి యమహా పక్కనే ఆగింది. అందులోనుండి నలుగురు దున్నల్లాంటి వ్యక్తులు దిగారు.
ఆమె తలెత్తి చూసింది. వాళ్ళు ఆమె కొసం వచ్చినట్లు దగ్గరకు వస్తున్నారు.
ఆమె వేగంగా కదిలింది. అతని పక్కన వచ్చి కూర్చొంది. ఆమె కళ్ళు అతని సహాయాన్ని అడిగాయి.

“దీనికి నీకు ఏమి సంబందం లేదు. తప్పుకో” నిర్లక్ష్యంగా ఉన్నాయ్ వాళ్ళ చూపులు.

బయట ఏదో శబ్దం అయ్యేసరికి దాబా కుర్రాడు కిటికిలోనుండి చూశాడు.
‘రయ్’మంటూ హైవె ఎక్కుతున్న యమహా కనిపించింది వాడికి.
కంగారుగా బయటకి వచ్చి చూశాడు. అక్కడ జరిగిన సంఘటన తాలూకు భయం వాడిలో కనిపించింది.
ఒకడు ముక్కులోనుండి వస్తున్న రక్తం తుడుచుకుంటూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. అక్కడ ఉన్న బల్లకి బలంగా తగలటం వల్ల ఇంకొకడి మొహం గుర్తుపట్టలేనంత విదంగా ఉంది. కింద పడి ఉన్న మరొకడికి చెయ్యి వెనక్కి తిరిగి వుంది.
ఒకడు మాత్రం నిల్చొని ఉన్నాడు. కానీ వాడు ఈ లోకంలో లేడు. పక్కనే పిడుగు పడ్డట్టు పై నుండి కింద వరకు వణికి పోతున్నాడు. వాడి కాళ్ళ దగ్గర వున్నవి నీళ్ళు కాదని దాబా కుర్రాడికి అర్ధమవ్వడంతో కొంచం వెనక్కి జరిగాడు.
కొంతసేపటికి తేరుకున్న వాడు మిగతా వాళ్ళని జీప్ లోకి వేసుకొని హైవే మీదకు ఎక్కించాడు.

చిందరవందరగా పడివున్న కుర్చీలు సర్దుతున్న దాబా కుర్రాడికి గాలికి కొట్టుకుంటున్న న్యూస్ పేపర్ ఆకర్షించింది.
అందులో వున్న ఫొటో, ఇందాక బైక్ కుర్రాడితో వెళ్ళిన అమ్మాయి అని గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
కాని అక్కడ ఏముందో చదవలేక పోయినందుకు, చిన్నప్పుడు తనని స్కూల్ కి పంపించని వాళ్ళ నాన్నని తిట్టుకున్నాడు.
**************
సమయం 7:30
హైదరాబాద్ 45 కి.మీ.

బైక్ లైట్ వెలుతురిలో మెరిశాయి సైన్ బోర్డ్ మీద అక్షరాలు.
చీకటిని చీల్చుకుంటూ బైక్ హైదరాబాద్ వైపుగా దూసుకు పోతూంది.

(సశేషం అలియాస్ ఇంకావుంది.)

ఒక రాజు – నలుగురు కొడుకులు

ఒక రాజుకి నలుగురు కొడుకులు.

ఒకసారి రాజుకి జ్వరం వచ్చింది. స్వెన్ ఫ్లూ ఏమోనని రాజ వైద్యుడు వచ్చి పరిక్షించి చూసి జ్వరానికి కారణం వీపు మీద లేచిన పుండు అని తేల్చి చెప్పాడు.
“ఇక్కడికి ఈశాన్యంగా ముప్పై క్రొసుల దూరంలొ వున్న కొండ మీద వున్న చెట్టు తొర్రలొ వున్న పిట్ట వేసిన రెట్ట తెస్తే, మందు చేసి పూస్తే, అప్పుడు తగ్గుతుంది.” అని పెట్టె మూసుకొని వెళ్ళిపొయాడు.

ముసలోడు (రాజు) తన కొడుకులను పిలిచి,
“నాయనలారా!”
“ముసలొడు మనకి ఎదో పెట్టాడు” మనస్సులో అనుకొని, పైకి
“తండ్రీ”
“నాకు ఈ జ్వరం తగ్గాలంటే మీరు నా కొసం ఒక సాహసం చెయ్యాలి” అని రాజవైద్యుడు చెప్పినది చెప్పాడు.
“సరే” అని మొదటి కొడుకు (వీడి పేరు అనవసరం) బయలుదేరాడు.
వెళ్ళినవాడు వెళ్ళినట్టే వున్నాడు. వాడి జాడ లేదు.

“సరే” అని రెండవ కొడుకు (వీడి పేరు కూడా అనవసరం) బయలుదేరాడు.
వీడి జాడ కూడా లేదు.

“సరే” అని మూడవ కొడుకు (వీడి పేరు మనకి అస్సలు అవసరం లేదు) బయలుదేరాడు.
వీడి జాడ కూడా లేదు.
“తండ్రీ నేను ఆరు నూరైనా …నూరు ఆరైనా.. మందు తీసుకొని వస్తాను.” అన్నాడు విజయుడు (వీడే మన హీరొ. అందుకే పేరు పెట్టా…).

మందు అనే పదం వినగానే రాజుకి నోట్లో నీళ్ళు కారాయ్. సారీ! వూరాయ్.

McDowells ని వూహించుకుంటూ విజయుడిని ఆశీర్వదించాడు.

ఒక మంచి తెల్ల గుర్రం మీద వారానికి సరిపడా ఆహారం తీసుకొని ఉత్తర దిక్కుగా వెళ్ళసాగాడు.

ఈశాన్యం వెళ్ళమంటే.. ఉత్తరంగా వెళ్ళుతున్నాడు ఎమిటా అనుకుంటున్నారా?

మన హీరొ కొంచం తేడాగాడు. వెరైటికి ప్రాణం ఇస్తాడు. పూరి జగన్నాథ్ హీరొ లాగ అన్న మాట. ఉత్తరంగా వెళ్ళినా ఈశాన్యం వస్తుందని వీడి వెధవ ఆలోచన.

అలా కొంత దూరం పొయేసరికి విజయుడికి మంచినీళ్ళు దాహం వేసింది.
(మంచి నీళ్ళు కాక వేరే దాహం కూడ వేస్తుందా? వీడు కొంచం తేడా కదా.. అప్పుడప్పుడు వేరే దాహం కూడా వేస్తుందిలే వీడికి..)

నీళ్ళకోసం వెతుకుతున్న విజయుడికి, దూరంగా నీళ్ళు పారుతున్న శబ్దం వినిపించింది. వేగంగా గుర్రాన్ని అటు వేపు పరిగెత్తించాడు.
అతనికి పెద్ద జలపాతం కనిపించే సరికి ఆనందంతో, గుర్రాన్ని అక్కడే వున్న చెట్టుకి కట్టి, జలపాతం లోకి దిగాడు.

కడుపునిండా నీళ్ళు త్రాగి బయటికి వస్తున్న విజయుడి కాలుకి ఎదొ చుట్టుకొని బలంగా లొపలికి లాక్కొని వెళ్ళింది.
పూర్తిగా నీళ్ళల్లొ మునిగిన విజయుడు దాన్ని ఎక్కడో చూసినట్లుందని ఆలోచించి, “ఆనకొండ” అని పెద్దగా అరిచాడు.
(ఈ మధ్యనే జెమిని లొ తెలుగు లొ చూసాడు)

నీళ్ళల్లొ వున్న విజయుడు చొక్కా చించుకొని దానితొ పోరాటానికి దిగాడు.
(ఆరు పెట్టెల బాడి చూసి అనకొండ పారి పొతుందేమోనని )
దాన్ని చంపటం ముందే చూసి వుండటం వల్ల,”జై జెమిని” అనుకొని వీజీగా చంపేసాడు.

వెంటనే బయటకు వచ్చి, నీళ్ళలోకి చూడసాగాడు.
(చచ్చిన అనకొండలో నుండి దేవత వచ్చి “ఎమి కావాలో కొరుకో!” అంటే ఏమి కోరుకోవాలో అని ఆలొచించసాగాడు)
ఎంతసేపటికీ రాకపొయేసరికి, నిరాశగా గుర్రం దగ్గరకు వెళ్ళాడు.

అప్పుడు గమనించాడు తన వంటి మీద అక్కడక్కడ గాయాలనుండి రక్తం వస్తుంది.
మా టివిలో చూసిన “ప్రకృతి వైద్యం” గుర్తుకు వచ్చి, కావలసిన మొక్కలు వెతకసాగాడు.
ఒక మొక్కని చూసి అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి.

దాని మొదట్లో పట్టుకొని బలంగా లాగాడు.
అంతే, ఒక పెద్ద మెరుపు,(మెరుపుతో పాటు శబ్దం కూడా వస్తుంది కదా. అందుకనే ప్రత్యేకంగా రాయలేదు. ఇంకు దండగని…)
వీటన్నింటితో పాటు దేవత కూడా ప్రత్యక్షమయ్యింది.

చొక్కా లేకుండా ఆరు పెట్టెల బాడీ తో వున్న విజయుడిని చూసి,
“నాయనా! శరీరమంతా సొట్టలతో, చొక్కా కూడ లేకుండా, పిచ్చి మొక్కలు పీక్కుంటూ తిరుగుతున్నావు. నేను నీకు ఏమినా సహయం చేయగలనా?” అని అడిగింది.

ఆశ్చర్యం తో కూడిన ఆనందం వల్ల వచిన సిగ్గుతో విజయుడు మెలికలు తిరగసాగాడు.
“విషయం చెప్పు.” మళ్ళీ ఆమే అడిగింది.
విజయుడు జరిగినదంతా డైలీ సీరియల్ లాగా కాకుండా టి20 లాగా చెప్పేసాడు.

“నన్ను ఆ చెట్టు దగ్గరకు చేర్చగలవా?” అని అడిగాడు.
“చెట్టు దగ్గరకు ఎంటిరా పిచ్చి వెధవా? ఆ పిట్ట రెట్టని కూడా తెచ్హి ఇవ్వగలను. నీ బుర్ర ఇంత వరకే పని చెస్తుంది.” అని మన్సులొ అనుకొని,
“తధాస్తు.” అని మాయమయ్యింది.

తన తెలివితేటలకి లోపల లోపలనే మురిసి పోతూ వుండగానే అక్కడ మాయమైన విజయుడు చెట్టు తొర్ర దగ్గర వున్నాడు.
వెంటనే ఏమీ ఆలోచించ కుండా తొర్రలో చెయ్యి పెట్టాడు పిట్ట కోసం. ఏదో కుట్టినట్లనిపిస్తే అంతే వేగంగా చెయ్యి వెనక్కు తీసుకున్నాడు.
బాధగా దిక్కులు చూస్తున్న అతనికి చెట్టు మీద చెక్కిన అక్షరాలు కనిపించాయి.
“ఈ చెట్టు తొర్రలొ వున్న పిట్ట పక్క సందులొ కొండ మీద వున్న చెట్టు తొర్రలోకి మారినది.”

కోపంతో విజయుడు పక్కనున్న కొండమీదకి ఎక్కసాగాడు.
అదే సమయంలో కొండ పళ్ళు ఏరుకుంటున్న కొండ రాజు కూతురు ‘ బండ రాణి ‘ విజయుడిని చూసింది.
ఆరు పెట్టెల బాడీ, చిరిగిన, రంగు పోయిన, ఒక బట్టన్ వూడిపోయిన జీన్స్ (Levis 501 series) వేసుకొన్న కొండగాడిని విజయుడిని ఇష్టపడింది.

ఒక కొండ పండుని తీసుకొని అతనిపై మెల్లగా విసిరింది. అది విజయుడికి బలంగా తగిలింది.
అసలే అనకొండ కొరికి, చెట్లు గీరి, ఏదో కుట్టి, ఈకలు పీకిన కోడి లాగా వున్న విజయుడికి చిర్రెత్తుకొచ్హింది.
కొండరాణిని చూసి “ఒసే బండదానా!” అని అరిచాడు.
తన పేరు ఎలా తెలిసిందో అని అశ్చర్యంతో కూడిన ఆనందం వల్ల వచ్హిన సిగ్గుతో చెట్టు చాటుకు పరిగెత్తింది.

ఒక్కసారిగా భూమి కంపించినట్లయింది. విజయుడు పడబొయి, పక్కనే వున్న చెట్టుని పట్టుకొని నిల్చున్నాడు.
“సిగ్గు పడింది చాలుగాని బయటకు రా!” అన్నాడు.
సిగ్గు పడుతూనే బయటకు వచ్హింది. విజయుడు ఇంక పట్టుకున్న చెట్టుని వదల్లేదు ఎందుకేనా మంచిదని.

“నీకు ఎమి కావాలి? ఇక్కడకు ఎందుకు వచ్చావ్?” అని అడిగింది ఒక మెలిక వేస్తూ.
కావలసింది ఇది అని చెప్పాడు.
(పిట్ట రెట్ట కావలని అడిగితే బాగొదేమోనని, పిట్ట కావలని చెప్పాడు. పిట్టని కొట్టి దాని రెట్ట తీయ్యచ్చని వీడి వెదవ ఆలొచన. కొంచం తేడాగాడు కదా)

అంతలొ నెత్తిన 1..2…3..50 పిడుగులు పడినట్లనిపించింది.
కళ్ళు తిరిగినయ్. తల చుట్టూ పిట్టలు తిరిగినయ్.

విజయుడి నెత్తి మీద గుద్దిన బండరాణి అమాయకంగా, “ఈ పిట్టల్లో నీకు కావలసిన దాన్ని పట్టుకో” అంది.
పిడుగు ఎటు నుండి పడిందా అని దిక్కులు చూస్తున్న విజయుడికి పిడుగుకి కారణం తెలిసింది.
వచ్చిన కోపం మింగి (వీడి అవసరం కదా..), “నాకు చెట్టు తొర్రలొ వున్న పిట్ట కావాలి.” అని అడిగాడు.

“అమ్మో ఆ పిట్టా! అది చాలా చెడ్డది. ఇంతకముందు దాని కోసం వచ్చిన వాల్లని ఏమి చెసిందో చూడు.” అని పక్కనే పడి వున్న మూడు అస్ఠిపంజరాలను చూపించింది.
పుర్రె (తలకాయ) లేని అస్ఠిపంజరాలను తన అన్నలుగా గుర్తించాడు విజయుడు.

“కాని నన్ను పెళ్ళి చెసుకుంటానంటే నీకు సహాయం చెస్తాను.” మళ్ళీ తనే అనింది.

“ఈ బండదాన్ని చేసుకోక తప్పేటట్లు లేదు” అనుకొని “సరే” అన్నాడు.

వెంటనే బండరాణి ఒక కొండ అరుపు అరిచింది.
ముందు పడిన పిడుగు కంటే దారుణంగా ఉంది ఆ అరుపు. చెవులో నుండి కారుతున్న రక్తం తుడుచుకుంటూ, ఏమి జరుగుతుందోనని చూడసాగాడు.
తొర్రలో నుండి పిట్ట బయటకి వచ్చి ఎదురుగా వున్న బండరాణిని చూసి,
“అనుకున్నా, అరిచింది ఈ బండదేనని.. దీని $!@%@$*$%్@$@”, అని లోపల తిట్టుకొని
“చెప్పండి మహారాణి” అని పిట్ట భాషలొ అంది.
(మీకు అర్ధం కావడానికి తెలుగులొ రాయటం జరిగినది)

విషయం చెప్పింది బండరాణి కొండభాషలొ.
వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ భాషలలో ఏదో మాట్లాడుకున్నారు.. పొడుచుకున్నారు..
విజయుడు ఓపికగా వింటున్నాడు. (వీడి అవసరం కదా..)
చివరికి పిట్ట వెళ్ళడానికి ఒప్పుకుంది.
తిక్క పెళ్ళి కుదిరిన విజయుడు బండరాణిని, పిట్టని తీసుకొని రాజ్యానికి బయలుదేరాడు (ఏనుగు ఎక్కి).

“హమ్మయ్య” అనుకొన్న తెల్ల గుర్రం మన్స్సులోనే కృతజ్ణతలు చెప్పుకొంది విజయుడికి.

*****

దూరం నుండే రాజ భటులు విజయుడిని గుర్తుపట్టి పరిగెత్తి వచ్చారు.
గుర్రంతో వెళ్ళి ఏనుగు (బండరాణి) తో వచ్చిన యువరాజుని స్వాగత సత్కారాలతో ఆహ్వానించారు.

రాజ వేద్యుడు పిట్ట రెట్టతో మందు చేసి రాజుకు పూయడం, అది వికటించి రాజు చచ్చి పొవటం, విజయుడు రాజు కావడం వెంట వెంటనే జరిగి పొయాయి.
విజయుడు – బండరాణి – ఒక పిట్ట… శుభం.

viJayudu banda raani   pitta

(అయిపొయింది.)

“చెత్త కధలతో, అర్ధం పర్ధం లేని సీన్స్ తో ప్రేక్షకులను హింసిస్తున్న సినిమా రచయితలు, దర్శకులకు ఈ కధ అంకితం.”