నాకు సినిమాలంటే పిచ్చి.
పిచ్చి అంటే మాములు పిచ్చి కాదు.
హిట్ ఐన సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయని చూస్తే.. ఫ్లాప్ ఐన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయని చూస్తాను.
ఆ పిచ్చికొద్ది..అప్పుడప్పుడు స్టుడియోలకి వెళ్తుంటాను. ఈవిధంగా స్టుడియోలకి వెళ్ళడం వల్ల జ్ఞానం పెరుగుతుందని గీతలో గాడ్ కృష్ణ చెప్పాడు.
ఎప్పుడు చెప్పాడు అని గీత గీసి వెతికేరు. మీకు కనిపించదు.
ఇలా వెళ్ళడం వల్ల నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ కొసం….
1) మన “మూవీ మొగల్” రామానాయుడి గారి పేరు నుండి ‘రా’ ‘నా’ అక్షరాలను తీసి ఆయన మనవడికి (సురేష్ బాబు కొడుకు) “రాణా”
అని పేరు పెట్టారని ఇండస్ట్రీ టాక్.
2) మన టివీలో చూసే డాన్స్ కాంపిటెషన్స్, సింగింగ్ కాంపిటెషన్స్ కూడా సినిమా షూటింగ్ లాంటిదే. జడ్జెస్ మాత్రం ఒక గంట ఉండి వాళ్ళ షూటింగ్ చేసుకొని వెళ్ళిపొతారు. ఆ తర్వాత దాన్ని మిక్స్ చేసి మన మీదకు వదులుతారు. అది మనవాళ్ళకి తెలియక అంతా నిజమేమోనని ఒకటే ఏడుపులు పెడబొబ్బలు..
మా గురువు గారు ఒకాయన రా.నా స్టుడియోలో పని చేస్తున్నారు. అదేనండి.. మన రామానాయుడు స్టుడియోలో.
మూడు మార్నింగ్ షోలు ఆరు మాట్నీలు ఎనిమిది ఫస్ట్ షోలు పదహారు సెకండ్ షోలుగా నా జీవితం సాగిపోతున్న రొజుల్లో…
ఒక రోజు రా.నా.స్టుడియోకి నేను వెళ్ళబడ్డాను.
మెయిన్ గేటు దాటి లోపలికి వెళ్ళగానే నా చెవులకు సినిమా గాలి తగిలింది.
ఎదో సినిమా సాంగ్ తీస్తున్నట్లున్నారు. ఒకతను మెగాఫోన్ పట్టుకొని పెద్దగా నెంబర్లు అరుస్తున్నాడు. జూ.డాన్సర్స్ కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నారు.
అతన్ని నేను గుర్తుపట్టాను. ఒక డాన్స్ ప్రోగ్రాంలో మైకు ముక్కు దగ్గర పెట్టుకొని తెలుగుని తమిళ్ లో మాట్లాడుతుంటాడు.
నేను ఈ మధ్య రెండు మూడు సార్లు టివీలో ఆ ప్రొగ్రాం చూశాను.
నన్ను గుర్తుపడతాడేమోనని “నేను కాదు” అన్న బోర్డ్ మెహానికి తగిలించుకొని అక్కడ నుండి మెల్లగా జారుకున్నాను.
ఒక 20 అంతస్థుల బిల్డింగ్ సెట్టింగ్ వేసుంది అక్కడ.
మా గురువు గారు చెప్పారు..మన ‘ ఫైర్ స్టార్ – గిరి ‘ (పేరు మార్చడం జరిగింది) గారి సినిమా కోసం వేశారని. ఎదో ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నట్లున్నారు.
గొప్ప యాక్షన్ హీరోగా ఆయనకు పేరుంది. మాంచి ఫైటింగులు..చేజింగులు..జంపింగులు.. ఉన్న సినిమాలను జనాల్లో వదిలిన అనుభవం ఆయనది..
చిన్నప్పుడు.. అంటే నాకు ‘ఊహ ‘ తెలియనప్పుడు… నేను ఆయనకు భయంకరమైన విసనకర్రని (ఫ్యాన్ ని)… ( ఇవివి ‘ ఆమె ‘ సినిమాలో మొదటిసారిగా ‘ఊహ ‘ని చూసాను.)
ఫైటింగ్ అంటే నాకు భలే ఇష్టం. ఆయన ఫైట్ సిల్వర్ స్క్రీన్ మీద చూడటం తప్ప లైవ్ లో చూడలేదు.
అదృష్టం గజ్జి పట్టినట్లు పట్టడం వల్ల ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది.
ఆ సెట్టింగ్ ముందు ఎత్తుగా పరుపులు పేరుస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఇదేదో జంపింగ్ సీన్ అని నా సినిమా బుర్రకి గోకింది.
నాకు వచ్చిన ఈ అవకాశాన్ని వదల దల్చుకోలేక అక్కడ అన్నింటికంటే ఎత్తుగా ఉన్న గోడ మీదకి ఎక్కాను.
అక్కడనుండి అంతా బాగా కనిపించడంతో నన్ను నేను భుజం తట్టుకున్నాను.
ఫైట్ మాస్టర్ మైక్ పట్టుకొని ఎదో అరుస్తున్నాడు. మన హీరో 20వ అంతస్తు పిట్ట గోడ మీద నుంచొని రెడీగా ఉన్నాడు దూకటానికి.
నేను అలెర్ట్ అయ్యాను.
“యాక్షన్”
నేను దూకేశాను.
దూకినట్లు మూమెంట్ ఇచ్చిన మన హీరోగారు మాత్రం “కట్” అనడంతో కిందకి దిగి వచ్చారు.
లారీ టైర్ కింద పడిన కప్పలాగా ఉంది నా పరిస్థితి. మెల్లగా లేచాను.
“యాక్షన్” అని వినిపించింది.
నాకు ఇక ఓపిక లేదు.
ఈసారి మాత్రం మన హీరోగారు దూకేశారు. ఒక చిన్న స్టూల్ మీద నుండి పరుపు మీదకి…
సెట్ అంతా చప్పట్లతో మారుమోగింది. పదిమంది వచ్చి ఆయన్ను తీసుకొని వెళ్ళారు.
“ఈమాత్రం దానికి ఇంత పెద్ద సెట్ వెయ్యాలా? బాబుఖాన్ బిల్డింగ్ దగ్గర తీస్తే పోలా?” బయటకే కక్కాను.
“ఇది భారీ బడ్జెట్ సినిమా” అని మా గురువు గారు సెలవిచ్చారు.
మొదట భాధేసింది. తర్వాత నా మీద నాకే జాలేసింది.
అంతలో దూరంగా ఎదో సందడి కనిపిస్తే కాళ్ళను అటువైపు నడిపించాను. ఆ హడావిడి ప్రెస్ మీట్ కోసమని తెలిసింది.
ముంబాయి నుండి దిగుమతి చేసుకోబడిన హీరొయిన్ “గిల్లిపోనా” (అలవాటు ప్రకారం పేరు మార్చడం జరిగింది) ఎవరితోనో సెల్ ఫోన్ లో మెలికలు పోతుంది. ఆమె ముందు టెబుల్ మీద “హింది-తెలుగు-హింది” డిక్ష్టనరీ ఉంది.
ఒకతని మీద చాలా మంది వాలి ఎదో చెప్తున్నారు. అతను చేతులు గాల్లో దెన్నో రుబ్బుతున్నాయి.
మా గురువు గారు చెప్పారు.. ఆయన గొప్ప దర్శకుడని..ఆయన చుట్టూ మూగిన వాళ్ళు కధారచయితలని.. ప్రస్తుతం ఆయన కొత్త కధని రుబ్బుతున్నాడని…
ఒకాయన దెన్నో పోగొట్టుకున్నట్లు తిరుగుతున్నాడు. ఈయన నాకు తెలుసు. గొప్ప లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఈయన ప్రొడక్షన్ లో వచ్చాయి.
“మొదటి షెడ్యూల్ లో పోయిన డబ్బులు నువ్వు తిరిగి ఇస్తావా?” అని నన్ను నిలదీయడంతో అక్కడి నుండి పారిపొయిన నేను ప్రెస్ మీట్ మొదలయ్యే టైంకి వచ్చాను.
‘పసి హృదయాలు – మంచి కసి మీద ఉన్నాయి ‘ అనే బ్యానర్ కట్టి వుంది.
ముందుగా దర్శకుడు మైకందుకున్నాడు.
“ఇది ఒక డిఫెరెంట్ సినిమా. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, వాళ్ళింట్లో పనమ్మాయి మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరి. పనమ్మాయిగా మన రెష్మ ప్రదర్శన నటన సినిమాకే హైలెట్. కధ పాతదే ఐనా కధనం కొత్తగా ఉంటుంది. యాక్షన్ లవ్ సెంటిమెంట్ అన్నీ ఉన్న ఫ్యామిలి ఎంటర్ టైనర్. తప్పకుండా ఒక ఫీల్ గుడ్ సినిమాగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయటం ఖాయం. మన నిర్మాత గారు ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా…” అని ఇంకా ఎదో చెప్తున్నాడు.
నేను ఆ నిర్మాత వైపు చూశాను. సగం కాలిన బీడీని కాలితో తొక్కి ఆర్పినట్లు ఉంది అతని మొహం.
ఇక ఇప్పుడు మన గిల్లిపోనా వంతు.
తెందీ (తెలుగు + హింది) రానివారు సబ్ టైటిల్స్ చూడండి.
“అండర్ కో ణమస్క రాం” అని తన పళ్ళు చూపించింది.
(అందరికీ నమస్కారం)
“ఈదో నేకి మడత సిన్మా”
(ఇది నాకు మొదటి సినిమా.)
నా కధలో బూతులు రాయడం ఇష్టంలేక ఇక నుండి సబ్ టైటిల్స్ మాత్రమే రాస్తున్నాను.
“ఈ సిన్మాలో నాది ఒక బబ్లీ గర్ల్ క్యారెక్టర్. అందరినీ సరదాగా ఎడిపిస్తూ తిరుగుతూంటాను. నాకు అందరూ ఇక్కడ నచ్చారు. ఐ లవ్ హైదరాబాద్ బిర్యాని.” మళ్ళీ పళ్ళు చూపించింది.
ఇక నేను అక్కడ వుండలేక పోయాను.
మా గురువుగారిని సెలవు అడుగుదామని..
“వళ్ళో వంగుతోము.”
(వెళ్ళి వస్తాను)
అన్నాను తెందీలో.
****
చాలా రోజుల తర్వాత …
ఒక రోజు…
న్యూస్ పేపర్ చూస్తున్న నాకు “ఫ్యామిలీతో టాంక్ బండ్ దగ్గర తిరుగుతున్న ఒక నిర్మాతని ఆత్మహత్య చెసుకోబోతున్నాడేమోనన్న అనుమానంతో లేక్ పోలిస్ అరెస్ట్ చేశారు.” అన్న వార్త కనిపించింది.
ఆ వార్త కిందనే ఒక సినిమా పొస్టర్ వుంది.
మన ‘ఫైర్ స్టార్ ‘ గిరి ఈఫిల్ టవర్ మీదనుండి దూకుతున్నాడు.
సినిమా టైటిల్ : ‘ఖడ్గమృగం – వీడు మనిషి కాడు ‘.
(అయిపోయింది.)
FireFox

hahaha…Super comedy…
good show!
దిమ్మతిరిగే సినీకామేడి కథ వ్రాసారు. బాగుంది. ఇక మరిన్ని తిమ్మిరి తెలుగు సినీమాకతలు / అను’భూతులు’ బ్లాగండి.
మీ బ్లాగు భలేనవ్వుగా ఉంది. ఇలాగే వ్రాయండి
baagundi
బాగుంది..!!
ఇంద్రలోకం

ఇక్కడ రంభ ఊర్వశి మేనక లేరు..
all the best !
Hi Phani. Your subtle story lines to which a common man can relate to easily are really interesting. They pack all the essential ingredients to make a story interesting and have a message embedded in the story content..We expect more stories from you…