Thugs Of Hyderabad | Hindi Independent Film |

లంకె

ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం 9-Nov-2014

10750003_10152654436442819_2530520143182065907_o

బొమ్మ

ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం 10-Aug-2014

Hyderabadalu_page1 Hyderabadalu_page2

శీనుగాడి బాబాయ్

ప్రతి సంవత్సరం వేసవి సెలవలకి మా అమ్మమ్మవాళ్ళ ఊరికి వెళ్ళడం అలవాటు. ఈ సారి మాత్రం ఎక్కువ రోజులుండటం కుదరదు మరి.

పదోతరగతి ఐన వెంటనే ఇంటర్ సిలబస్ మొదలు పెట్టేస్తారు. ఇంటర్ తో పాటుగా EAMCET కోచింగ్ ఒకటి. రెండు సంవత్సరాలు ఊపిరిసలపనంత చదువుంది. ఎలాగోలా ఒక పదిరోజులు అమ్మమ్మవాళ్ళ ఊరిలో మకాం వేసేందుకు నాన్నను ఒప్పించా.

ఇంకో రెండు సంవత్సరాలకు సరిపడా ఈ పది రోజుల్లోనే గడిపేయాలని బస్సు ఎక్కుతోనే నిర్ణయించుకున్నాను. టౌను నుండి ఒక గంట ప్రయాణం అమ్మమ్మ వాళ్ళ ఊరు. బస్సు ఎక్కడంతోనే బస్టాండ్ లో కొన్న బాలమిత్ర చదవడం నాకు అలవాటు. మొదట్లో మా నాన్న వదిలి పెట్టి వచ్చేవారు. అప్పుడు నేను తప్పని సరిగా గొల్డ్ స్పాట్ తాగి బాలమిత్ర కొనిపించుకొనే వాడిని. ఊరు వచ్చే లోగా ముందు గబగబా మినీ నవల చదివి మిగతా కధలు పూర్తి చెసేవాడిని. ఒక్కొసారి కొన్ని కధలు చదవకుండా తర్వాతకి దాచుకునేవాడిని.

ఊళ్ళో బస్సు దిగటంతోనే ఎదురుగా ఉంటది కిట్టయ్య కొట్టు. పులిబొంగరం తింటే కిట్టయ్య కొట్లోనే తినాలని పక్క ఊళ్ళల్లో చెప్పుకుంటారు. కొట్టు కిట్టయ్య కొడుకు పూర్ణగాడు, నేను ఊళ్ళొనే కలసి చదువుకున్నాం. నేను ఐదవ తరగతి దాకా ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. ఇక్కడ చదువు సరిగ్గా సాగట్లేదని మా నాన్న టౌన్ లో చేర్పించి మకాం కూడా అక్కడికే మార్చాడు.

బస్సు దిగుతున్న నన్ను చూడగానే కొట్లో కూర్చున్న పూర్ణగాడి మొఖం వెలిగి పోయింది.

పక్కనే పులి బొంగరాలు వేస్తున్న వాళ్ళ నాన్నకి కనిపించకుండా సైగ చేశాడు. శీనుగాడిని, సూరిగాడిని తీసుకొని మన అడ్డా దగ్గరికి రమ్మని నేను కూడా సైగ చేసి ఇంటికి పరిగెత్తా. పులి బొంగరాలు తెమ్మని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వాడికి.

మిట్ట మధాహ్నం ఎండలో ఇంటి ముందు కందులు ఆరబోస్తూ కనిపించింది అమ్మమ్మ. మహాలక్ష్మమ్మ అంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో హడల్. తాత పొయి ఆరు సంవత్సరాలైనా గట్టిగా నిలబడి తానే పొలం పనులన్నీ చూసుకుంటుంది. గట్టు మీద నిలబడి అరిచిందంటే పది గొర్రుల పొలంలో పని చేసే కూలొళ్ళంతా పరిగెత్తాల్సిందే.  కల్లంలో గింజ పొల్లు పోనీయదు. కూలివ్వడంలో పావలా తేడా రానియ్యదు.

నన్ను చూస్తూనే చేసే పని వదిలేసి పరుగున వచ్చింది.

“మానాయనే! చిక్కి పోయావేందిరా. బక్కగా అయినావ్ మీ తాత లాగా..”

నేను పంచలో వాల్చిన మంచం మీద కూర్చుంటే, ఇత్తడి బుడ్డి చెంబులో నీళ్ళు తెచ్చి ఇచ్చింది అమ్మమ్మ.

“కొత్త కుండలో నీళ్ళు. బాగా సల్లగా ఉంటయ్. నువ్వొత్తావని మంచం సల్లు లాగిచ్చా ఎంకడిని పిలిచి.” అమ్మమ్మ చెబుతుంటే, ఊరందరినీ హడల్ కొట్టే మాలక్ష్మమ్మ నా మెప్పు పొందటానికి చేసే ప్రయత్నం కనిపించింది.

“మీ నాయనికి నేను చెప్పలేకపొతిని. ఏమి చదువులో పిల్లల్ని పిండక తింటన్నయ్. మీ తాత చదువుకున్నాడా ఎంది?”

నేను ఎమీ మాటాడక పొయేసరికి, మళ్ళీ తనే..

“అవున్లే, ఆ కాలం వేరు. బాగా చదుకొని ఆఫీసర్ ఉద్యోగం చెయ్యాల నా మనవడు.” మురుసుకుంటూ లోపలికి వెళ్ళింది.

“నీ కోసం ఆ వెంకట్రావ్ కొడుకు, కొట్టు కిట్టయ్య కొడుకు తెగ తిరిగి పోయార్రా.” లోపలనుండే చెప్పింది.

నేను కూడా వాళ్ళ కోసమే ఎదురుచూస్తున్నా. సూరిగాడిది పక్కిల్లే.. నాలుగిల్లవతల శీనుగాడిది..

ఇప్పుడే వెళ్తానంటే ఒప్పుకోదు. ఉన్న నాలుగురోజులైనా ఇంటిపట్టునుండాలంటది. కాని నేను ఇక్కడికి వచ్చిందే వీలైనంతవరకు వాళ్ళతో ఆడుకోవాలని కదా.

సజ్జ బూరెలు, కారప్పూస కొత్త స్టీలు ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చింది.

“మన తూర్పు చేలో పండినయ్ సజ్జలు. సుబ్బి పిండి కొట్టింది.” అమ్మమ్మ చెబుతున్నా నేను మాత్రం అక్కడ లేను.

ఒక బూరే కొంచం కొరికి, “అమ్మమ్మా, నేను శీనుగాడి దగ్గరికి వెళ్ళి వస్తా” అన్నా ఒప్పుకోదని తెలిసికూడా.

“వాళ్ళేడికి పోతార్రా. చల్ల జామున ఆడుకుందుర్లే. అన్నం తిని పరమటింట్లో పడుకో అందాకా.” అని నేను చెప్పేది వినిపించుకోకుండా నా బట్టల సంచి లోపలికి తీసుకెళ్ళింది.

“ఐతే ఇప్పుడే అన్నం పెట్టు” అని తొట్టి దగ్గర కాళ్ళు చేతులు కడిగి, పీట లాక్కొని కూర్చొన్నాను.

నన్ను కనిపెట్టి అమ్మమ్మ కూడా నవ్వుకుంది.

***************

నలుగురం ఏటిగట్టునున్న మామిడితోటకి పరిగెత్తాం, అమ్మమ్మ పిలుస్తున్నా వినకుండా.

ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాం, పూర్ణాగాడు పొట్లాం విప్పడమే ఆలస్యమన్నట్లు చూస్తూ. తలా రెండు పులి బొంగరాలు తిన్నాక, గట్టు మీద నుండి ఏట్లొకి దూకి ఈత కొట్టాం.

తొటలో రెండు పచ్చి మామిడి కాయలు కోసుకొని శీనువాళ్ళ కొట్టానికి వచ్చాం.పంచకమ్మిన దాచిన ఉప్పుకారం పొట్లాం తీసాడు శీనుగాడు. మా అందరికీ నొట్లో నీళ్ళూరాయ్. సూరిగాడు కాకి ఎంగిలి చేసి తలా ఒక ముక్క పెడుతుంటే, మేము ఉప్పుకారం లో ముంచుకొని తిన్నాం. దాగుడు మూతలు ఆడాలని ఎకగ్రీవంగా తీర్మానించాం. సూరిగాడు నెంబర్లు లెక్క పెడితే మేము దాక్కున్నాం.
నేను కొస్టాంలొ మూలన పెట్టిన వరి బోదెలో దిగి దాక్కున్నా. అడుగున వరిగడ్డీ పోసి మెత్తగా వుంది.

చాలసేపు ఆడి అలసిపోయుండటం వల్ల వెంటనే నిద్ర పట్టేసింది.

***************

కళ్ళు తెరిచిచూసే సరికి అంతా చీకటిగా వుంది. ఎంతసేపు నిద్ర పొయానో కూడా తెలీదు. బోదెలో నుండి దిగి కొస్టం బైటకి వచ్చా. పండు వెన్నెల్లో అంతా స్పష్టంగా కనిపిస్తుంది.

కాని నేను ఒక్కడినే ఉండేసరికి భయమేసింది. చుట్టూ చూసుకుంటూ, మెల్లగా ఇంటి వైపు నడవడం మొదలు పెట్టా.

మాములుగా ఐతే ఇల్లు అంత దూరమున్నట్లు అని పించేది కాదు. ఒక్క పరుగులో ఇంటికి చేరుకొనే వాళ్ళం.

మామిడి తోపు గట్టుగా వేసిన వెదురు చెట్లు గాలికి వూగుతూ శబ్దం చేస్తున్నాయ్. అవి ఎంత భయంకరంగా వున్నాయంటే చెట్లు కూడా భయపడి వద్దంటూ తలలు ఆడిస్తున్నాయ్.

వెంటనే మూల తిరిగే దగ్గరున్న చింతచెట్టు గుర్తుకు వచ్చి ఒక్కసారిగా నా కాళ్ళు నడవడం ఆపేసాయి. దానికి రాత్రిపూట దెయ్యాలు ఊగుతుంటాయని చెప్పుకుంటారు. సూరిగాడు కూడా ఒకసారి చూసాడంట.

చెమటలతో వళ్ళంతా తడిసి ముద్దయ్యింది. చల్లగాలికి వణుకు కూడా మొదలైంది. అలాగే మెల్లిగా నడవడం మొదలు పెట్టాను. చింత చెట్టు దగ్గరయ్యెకొద్దీ నాలో భయం తాలుకు ఆనవాళ్ళూ రెట్టింపయ్యాయి.

చీకట్లో మరీ భయంకరంగా వుంది.  ఇక లాభంలేదనుకొని, మనసులోనే “ఒకటి..రెండు..మూడు..” అని ఒక్క పరుగు అందుకొనేలొపలే,

నా భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్లయ్యింది. అంతే ఒక్కసారిగా పెద్దగా అరిచి కళ్ళు మూసుకున్నా.

“ఒరే, నేను శీనుగాడి బాబాయిని రా!”
కళ్ళు తెరిచి చూసా. “అవును”. కొంచెం నెమ్మదించా.
“ఇక్కడేం చేస్తున్నావురా, ఇంత చీకట్లో, ఇంటికి పోకుండా?” ఆడిగాడు శీనుగాడి బాబాయ్.
మొత్తం చెప్పా. భయం పోయేసరికి, వాళ్ళమీద కోపం వచ్చింది, నన్ను ఇలా ఒక్కడిని వదిలి వెళ్ళేసరికి.

“సరే, నాతోరా..” అని చెయ్యి పట్టుకొని లాగినట్లు తీసుకెళ్ళసాగాడు.
పక్కన ఆయన వున్నా చింత చెట్టు దగ్గరయ్యేసరికి నా నడక వేగం తగ్గింది. అది గమనించి,
“ఏరా, చింత చెట్టంటే భయమా? ఎందుకు..?”
నేను విన్నది చెప్పా. “నిజమేనా?” అన్నట్లు చూసా.

“దెయ్యాలు వేళ్ళాడమెంటి? వాళ్ళ పిచ్చి గాని. పద చూపిస్తా.” అని వద్దన్నా వినకుండా చెట్టు కిందకు లాక్కెళ్ళాడు.
“చూడు. ఏవి దెయ్యాలు?”
“అవును. నిజంగా దెయ్యాలు లేవు.” అన్నాను చుట్టూ చూస్తూ. కొంచెం ధైర్యం వచ్చింది నాకు.
పైకి తలెత్తి, చింత చెట్టును గమనించసాగాను. దూరంగా కనిపించినంత భయంకరంగా ఏమి లేదు ఆ చింత చెట్టు. కొమ్మలు బాగా బలంగా అందనంత ఎత్తులో వున్నాయ్.

ఇంకా భయం పొగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న నేను, “అసలు..అంతేత్తు కొమ్మకి దెయ్యం ఎలా వేళ్ళాడిద్ది?” అన్నా చిన్నగా నవ్వుతూ.

“ఇలా” అంటూ మాయమైన శీనుగాడి బాబాయ్ చెట్టు కొమ్మకు వేళ్ళాడుతూ కనిపించాడు.

ఒక్కసారిగా తలలో మొదలైన వణుకు వళ్ళంతా పాకింది. కాళ్ళ కింద భూమి పరిగెత్తింది. వెనక్కి తిరగకుండా పరిగెత్తుతూనే వున్నా, ఎంతసేపటికీ ఇల్లు రావడంలేదు.

అప్పుడప్పుడు, దారి పక్కన శీనుగాడి బాబాయ్ కనిపించి, “పడతావురొయ్.. చిన్నగా వెళ్ళు.” అని

మరో పక్క కనిపించి “చింత చెట్టుకి ఉయ్యాల ఊగుతావా?” అని అడుగుతున్నాడు.

పరిగెత్తుతున్న నాకు దూరంగా ఒక ఆకారం నావైపు రావడం చూసా. చెతిలో ఎదో వెలుగుతూ కూడా వుంది.
“వామ్మో, కొరివి దెయ్యం” అని కుప్పకూలిపోయా.

**************

కళ్ళు తెరిచేసరికి అమ్మమ్మ ఒళ్ళొ వున్నా, నుదిటి మీద తడి గుడ్డతో.
“రాత్రంతా ఒక్కటే కలవరింతల్రా. ఎవరి దిష్టి తగిలిందో ఏమో నా బిడ్డకు..” కళ్ళకు నీరొత్తుకుంది అమ్మమ్మ.
“లేచి మొహం కడుక్కో.. రెండు ఇడ్డెనలు తిందుగ్గాని.”
లేచి కూర్చున్నా. కాళ్ళు లాగేస్తున్నాయ్. తలంతా భారంగా అనిపించింది. రాత్రి జరిగినదంతా ఒక్కసారి కళ్ళముందు తిరిగింది.
లేని సత్తువ కూడగట్టుకొని, శీనుగాడింటికి పరిగెత్తా.
“ఒరే, నీకోసం వెతికి కనిపించక పొయేసరికి, మీ అమ్మమ్మకి చెప్పాం నిన్న సాయంత్రం.” అన్నాడు వాడు నన్ను చూస్తూనే.
“మీ బాబాయ్ ఎక్కడ?” సూటిగా అడిగా.
గోడ మీద వున్న పటం చూపించాడు శీనుగాడు. రెండు నెలల క్రితం ఎట్లో దూకి చనిపొయాడు శీనుగాడి బాబాయ్.
(అయిపొయింది.)

Previous Older Entries